టమాటో మరోసారి రైతుల పుట్టి ముంచింది. బహిరంగ మార్కెట్‌లో పది రూపాయలు పలుకుతున్న టమాటో.. మార్కెట్ యార్డులలో మాత్రం కనీసం రూపాయి కూడా పలకని పరిస్థితి నెలకొంది. గత వారం రోజులుగా ఓమాదిరిగా వున్న టమాటో ధరలు నిన్నటి నుంచి భారీగా పతనమయ్యాయి. దీంతో రైతులకు రవాణా ఖర్చులు కూడా మిగలని పరిస్థితి నెలకొంది. 


చిత్తూరు జిల్లా పడమటి మండలాలు అంటే గుర్తుకు వచ్చేది టమాటో పంట. దేశ విదేశాలకు ఇక్కడ నుంచి టమాటో ఎగుమతి అవుతుంది. ఇప్పుడు టమాటో రైతుకు గిట్టుబాట ధర లభించక పంటను పశువులకు వదిలేస్తున్నారు. జిల్లాలోని పడమటి మండలాలు అయిన మదనపల్లి, పీలేరు, పుంగనూరు, పలమనేరు, తంబల్లపల్లి, కుప్పం నియోజకవర్గాల పరిధిలోని లక్ష ఎకరాల్లో టమాటో సాగవుతోంది. గత నలభై ఏళ్లుగా ఈప్రాంతంలో టమాటో  పండిస్తున్నారు రైతులు. భూగర్బ జలం తగ్గిపోతున్నప్పటికి డ్రిప్ సౌకర్యాలతో నీటి తడులు అందిస్తూ పంటను సాగు చేస్తున్నారు.


గత సంవత్సర కాలంలో టమాటో రైతులను నష్టాలు వెంటాడుతున్నాయి. కనీస గిట్టుబాటు ధర లభించడం లేదు. టమాటో  కిలో ధర 2రూపాయలకు పడిపోయింది. అయితే రవాణా ఖర్చుతో పాటు కమీషన్ పోతే రైతుకు మిగిలేది కిలోకు ముప్పయి పైసలు మాత్రమే. అయితే వినియోగదారుడు మాత్రం కిలో టమాటో కొనాలంటే పది రూపాయలకు పైగానే చెల్లిస్తున్నాడు. మార్కెట్ కు టమాటోను తరలించినా నష్టపోతామనే భావనతో.. చేతికొచ్చిన పంటను పశువులకు ఆహారంగా వేస్తున్నారు రైతులు. 


దక్షిణాసియాలో అతిపెద్ద టమాటో మార్కెట్ గా వున్న మదనపల్లి మార్కెట్ యార్డుకు కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి ప్రతిరోజు వందలాది టన్నుల టమాటో వస్తుంది. డిమాండ్‌ లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోందని రైతులు చెబుతున్నారు. టమాటో సాగుకు అధిక ప్రాధాన్యత ఇచ్చే పడమటి మండలాల రైతులు తగ్గుతున్న ధరలు చూసి హడలిపోతున్నారు. మదనపల్లె డివిజన్‌లో సుమారు 20 వేల హెక్టార్లలో టమాటో సాగు చేస్తున్నారు. సీజన్‌తో పనిలేకుండా ఏడాది పొడవునా ఇక్కడి రైతులు టమాటో సాగువుతుంది. కాగా జనవరిలో టమాటో సాగుకు అంకురం పడుతుండగా, మార్చి నుంచి జూన్‌ వరకూ ప్రధాన సీజన్‌ నడుస్తుంది. ఈ మూడు నెలల వాతావరణంలో టమోటా మంచి దిగుబడి రావడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధరలు వస్తాయని నమ్మకం. కాగా మే నెలలో మదనపల్లె టమోటా మార్కెట్‌కు 200 మెట్రిక్‌టన్నులు మాత్రమే రాగా, కిలో గరిష్ట ధర 42 దాకా పలికగా, కనిష్ట ధర కిలో రూ.14 పలికింది. వారం రోజులు నుండి టమోటా ధరలు తిరోగమనంలో పడిపోయాయి. ఇదే పరిస్థితి మరో వారం రోజులు కొనసాగితే టమోటా పంటను తోటల్లోనే వదిలేయాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: