ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు తెలుగు రాష్ర్టాల్లో జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలతో వరద ఉధృతి పెరుగుతోంది, శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తింది. ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. నీటి మట్టం దాదాపుగా పూర్తి స్థాయికి చేరుకుంది. అటు గోదావరి కూడా ఉప్పొంగి ప్రవహిస్తుంది, ధవళేశ్వరం బ్యారేజి నుంచి భారీగా నీటిని సముద్రంలోకి వదులుతున్నారు అధికారులు.

కృష్ణా నదికి మరోసారి వరద పోటెత్తింది. జూరాలకు వరద పెరగడంతో భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ఇన్ ఫ్లో రెండు లక్షల డెబ్బై వేల క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో రెండు పాయింట్ ఏడు రెండు లక్షలుగా కొనసాగుతోంది.శ్రీశైలంలో ప్రాజెక్టు నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. క్రస్ట్ గేట్ల పై నుంచి నీరు ప్రవహించడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి మూడు లక్షల నలభై ఒక్క వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. వరద ఉద్ధృతి ఇంకా పెరిగే అవకాశం ఉంది, దీంతో ఆరు గేట్లు ఎత్తి నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల క్యూసెక్యుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.

ప్రాజెక్టు కుడి, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తవుతుంది. కృష్ణ ప్రధాన ఉపనదులైన తుంగభద్ర, భీమా పరివాహక ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణా నదిలోను వరద ప్రవాహం పెరిగింది. శ్రీశైలం నుంచి నీరు విడుదల చేయడంతో నాగార్జున సాగర్ లో నీటి మట్టం పెరిగింది.అంతేస్థాయిలో కుడి, ఎడమ కాలువలు పులిచింతల,ఎ ఎం ఆర్ పి లకు నీటిని వదులుతున్నారు అధికారులు.

దీంతో నాగర్జునసాగర్ ఇరవై నాలుగు గేట్లు ఎత్తి మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల క్యూసెక్యుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు గోదావరి కూడా ఉప్పొంగి ప్రవహిస్తోంది. రెండ్రోజులుగా ధవళేశ్వరం బ్యారేజి వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండడంతో కోనసీమ లోని లంక గ్రామాలు వణికిపోతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో మరో రెండు మూడు రోజుల పాటు వరద ఉధృతి ఉంటుందని జల వనరుల శాఖ చెప్తోంది.

కాటన్ బ్యారేజి వద్ద పదిహేను అడుగుల మేర నీటి మట్టం నమోదైంది.దీంతో బ్యారేజీ నూట డెబ్బై ఐదు గేట్లను పూర్తిగా ఎత్తి పదిహేను లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. భద్రాచలం వద్ద గోదావరి శాంతించింది అక్కడి నీటి మట్టం నలభై అడుగులకు తగ్గింది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏడు పాయింట్ ఆరు కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.

దీని ప్రభావం వల్ల తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు. నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: