అధికారంలో ఉన్నప్పుడు తమ మాటే శాసనంగా పెత్తనం చెలాయించారు టీడీపీ నేతలు. పదవి ఉన్న సమయంలో, ఇప్పుడు పదవి లేని సమయంలో వాళ్లు చేసిన పనులకు కేసులు చుట్టుకుని ఊపిరాడకుండా చేస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని ఓ ఎంపీడీఓను బెదిరించారనే ఆరోపణల్లో ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పై కేసు నమోదైంది. ఈ విషయమై తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలు ఇచ్చారు. దీంతో కూన రవికుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినా కింది కోర్టులు కొట్టేయడంతో హైకోర్టులో ప్రయత్నిస్తున్నారు.



టీడీపీలో ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫోర్జరీ డాక్యుమెంట్స్ కేసులో ఇరుక్కున్నారు. ఇడిమేపల్లిలో 2.40 ఎకరాల భూములను అమ్మినట్టు నమోదు అయిన కేసులో సోమిరెడ్డిని నిందితులుగా చేర్చారు పోలీసులు. ప్రభుత్వ భూమిని అక్రమంగా అమ్ముకున్నారని ఆయన పై అభియోగం దాఖలైంది. కోర్టు ఆదేశాల మేరకు సోమిరెడ్డి మీద కేసు నమోదు చేశారు. దీంతో ఆయన కూడా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. టీడీపీ ఫైర్ బ్రాండ్ చింతమనేని ప్రభాకర్.. పినకడిమి గ్రామానికి చెందిన దళిత యువకులపై దాడి ఘటనలో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు పలు అక్రమాలు, దౌర్జన్యాలకు సంబంధించి 10 కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు చింతమనేని 12 రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నాటకీయ పరిణామాల మధ్య ఈరోజు చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.


 

మాజీ స్పీకర్ కోడెలపై కేసులకు లెక్కే లేదు. ఏకంగా ఆయన అసెంబ్లీ ఫర్నీచర్ నే సొంతంగా వాడుకున్నారని కేసులు నమోదయ్యాయి. ఆయన కుమారుడు, కుమార్తె కేసులకు లెక్కేలేదు. ఇలా టీడీపీ నాయకులకు అధికారంలో ఉండగా చెల్లిపోయింది కానీ ఇప్పుడేమీ చెల్లుబాటు కావటం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: