తెలుగుదేశం పార్టీ చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని  పోలీసులు భగ్నం చేశారు.  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును గృహనిర్బంధం చేసి,  టిడిపి నేతలను,  కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేయడం ద్వారా పోలీసులు తాము అనుకున్నది సాధించారు.  పల్నాడులో శాంతిభద్రతల నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను,  నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు.   అధికార వైకాపా,  ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీలు పోటాపోటీగా చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.  శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా టిడిపి నేతలను ముందస్తుగానే అరెస్టు చేసిన పోలీసులు,  వైకాపా నేతలను కూడా ఆత్మకూరు వెళ్లకుండా నిలువరించడం లో సక్సెసయ్యారు .


  ఇక టీడీపీ నేతలను ఎక్కడిక్కడ  అరెస్టు చేసిన పోలీసులు... ఆ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మకూరు లో  ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సందర్శించారు.  పునరావాస కేంద్రాల్లో ఉన్నవారిని కలిసి వారి  వివరాలను అడిగి  తెలుసుకున్నారు . పునరావాస కేంద్రాల్లో  రాజకీయ దాడులు,  ప్రతి దాడుల భయంతో  తలదాచుకోవాలని భావిస్తున్న వారు కొందరైతే ,  ఇక  వ్యక్తిగత భద్రత కోసం మరికొందరు పునరావాస కేంద్రాల్లో  ఉండాలని నిర్ణయించుకున్నట్లు  తెలుస్తోంది.  పునరావాస కేంద్రాల్లో ఉన్న వారి  వ్యక్తిగత  వివరాలు తెలుసుకున్న పోలీసులు,  వారిని సొంత గ్రామాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.  సొంత గ్రామాలకు వెళ్లే వారికి భద్రత కల్పించే బాధ్యతను పోలీసులు తీసుకుంటున్నారు. 


దీంతో తెలుగుదేశం పార్టీ  చేపట్టాలనుకుంటున్న పునరావాస కేంద్రాల కార్యక్రమం... ప్రారంభం కాక ముందే  దాదాపుగా ముగిసినట్లేనని రాజకీయ పరిశీలకులు  అంచనా వేస్తున్నారు  . టీడీపీ ఆధ్వర్యం లో  నిర్వహించే పునరావాస కేంద్రాల్లో తలదాచుకునే వ్యక్తులు,  ఏదో ఒకరోజు తమ  సొంత గ్రామాలకు వెళ్లాల్సిందేనని, అప్పుడైనా వారికి భద్రత కల్పించాల్సింది పోలీసులేనని...  చంద్రబాబునాయుడు కాదని గుర్తు చేస్తున్నారు . పోలీసులు భద్రత కల్పిస్తామని చెప్పిన తరువాత బాధితులు స్వగ్రామాలకు వెళ్లడం మంచిదని సూచిస్తున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: