గత కొద్ది రోజులుగా దేశమంతటా కొత్తగా వచ్చిన మోటార్ వెహికల్ చట్టం గురించే చర్చ. వాహనదారులు హెల్మెట్ల తో పాటు ఇప్పటికే లైసెన్స్ లు మరియు ఇతర డాక్యుమెంట్లు సమకూర్చుకునే పనిలో పడ్డారు. కొంతమంది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సలాం  కొట్టగా ఇంకొంతమంది లబోదిబోమంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే దేశమంతటా వేలకు వేల రూపాయలు జరిమానాల రూపంలో వసూలు చేస్తుంటే ఒకే ఒక్క రాష్ట్రంలో మాత్రం వాటిని దాదాపు 90 శాతం తగ్గించారు. ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే అది స్వయానా మన ప్రధానమంత్రి మోడీ గారి రాష్ట్రమైన గుజరాత్.

అవును… గుజరాత్ ముఖ్యమంత్రి అయిన విజయ్ రూపాని జరిమానాలను భారీస్థాయిలో తగ్గిస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఇందులో భాగంగా దేశమంతటా కొత్తగా వచ్చిన ట్రాఫిక్ చట్టాల ప్రకారం హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు జరిమానా కాగా గుజరాత్ లో మాత్రం కేవలం 500 రూపాయలే. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే 1000 రూపాయలకి బదులుగా దీనిని కూడా 500 కి తగ్గించారు. ట్రిపుల్ రైడింగ్ కనుక చేస్తే గుజరాత్ లో కట్టాల్సిన జరిమానా కేవలం 100 రూపాయలు. మిగతా చోట్ల మాత్రం 1000 రూపాయలు.

మోటార్ వెహికల్ చట్టం 2019 లో  డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే కట్టాల్సిన జరిమానా 5000 కాగా మోడీ సొంత రాష్ట్రంలో మాత్రం టూ-వీలర్ కి 2000 మిగతా బండ్లకు 3000 రూపాయలుగా నిర్ణయించారు. కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం కాలుష్యాన్ని కలిగించే వాహనాలు నడిపితే జరిమానా 10,000 కాగా గుజరాత్ లో మాత్రం చిన్న సైజు వాహనానికి 1000 రూపాయలు, పెద్ద సైజు వాహనాలకు 3000 రూపాయలకు తగ్గించారు. ఇలా తగ్గించిన జరిమానాల లిస్టు విడుదల చేయగా గుజరాతీలు సంబరాలు చేసుకుంటూ ఉంటే ఇతర రాష్ట్రాల ప్రజలు మాత్రం ఇదేమిటని నోర్లు వెళ్ళబెడుతున్నారు. ఇంకా దీనిపై మోడీ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. తమ సీఎం కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుండని ప్రతీ రాష్ట్రంలోని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: