మాజీ మంత్రి వివేకానందరెడ్డి మార్చి పదిహేడున దారుణ హత్యకు గురయ్యారు. హత్య జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు సిట్ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారమే పదమూడు వందలు మందిని విచారించారు. కీలక అనుమానితులుగా భావిస్తున్న కసునూరు పరమేశ్వరరెడ్డి, దుద్దేకుంట చంద్రశేఖర్రెడ్డి, వివేకా ఇంటి వాచ్ మెన్ రంగయ్య ఎర్ర గంగిరెడ్డిలను నార్కో బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్షల నిమిత్తం గుజరాత్ కు తరలించి పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ నలుగురిలో కసునూరు పరమేశ్ నార్కో పరీక్షలకు నిరాకరించాడు. ఈనేపధ్యంలో వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా భావిస్తున్న శ్రీనివాస్ రెడ్డి అనుమానస్పదస్థితిలో మృతి చెందాడు.


సిట్ అధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి బంధువులు ఆరోపించారు. ఇక్కడే సిట్ అధికారులకు వచ్చిన అనుమానాలు కేసు దర్యాప్తుకు కీలకంగా మారినట్టు తెలుస్తోంది. క్రిమినల్ మైండ్ ఉన్న శ్రీనివాస్ రెడ్డి ఒక్కసారి విచారణకే ఆత్మహత్య చేసుకున్నాడా, ఈ కోణంలో విచారణ జరిపిన సిట్ టీంకు కొత్త కొత్త అంశాలు తెలిసినట్లు సమాచారం. దీంతో వెతకపోతే తీగ కాలికి తగిలినట్లు దర్యాప్తు సంస్థ శ్రీనివాస్ రెడ్డి అనుమానస్పద మృతి వెనక కారణాలు ఏమై ఉంటాయన్న కోణంలో ఆరా తీయడం ప్రారంభించింది.


శ్రీనివాస్ రెడ్డి పోస్టు మార్టం రిపోర్టుతో పాటు సూసైడ్ లెటర్ ను విశ్లేషిస్తోంది. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం శ్రీనివాసరెడ్డిని హత్య చేసి ఆత్మహత్యగా క్రియేట్ చేసినట్లు దర్యాప్తు బృందం ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ రెడ్డి అనుమానస్పద మృతి రోజు కసునూరి పరమేశ్ మీడియాతో చేసిన వ్యాఖ్యలు కేసు దర్యాప్తును పక్కదోవ పట్టించే విధంగా ఉన్నట్లు సిట్ భావిస్తోంది. శ్రీనివాసురెడ్డి అనుమానస్పద మృతి కేసు చేధిస్తే వివేకానందరెడ్డి కేసులో దర్యాప్తు పురోగతి సాధించినట్లే అన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అంతేగాకుండా శ్రీనివాస్ రెడ్డి రాసినట్టుగా చెబుతున్న సూసైడ్ నోట్ అతను రాసింది కాదని నిర్ధారణకు సిట్ వచ్చినట్టు తెలుస్తోంది.


శ్రీనివాసురెడ్డి ఎడమ చేతి వాటం ఉన్న వ్యక్తి కానీ ఆయన సూసైడ్ నోట్లో ఉన్న చేతిరాత కుడి చేతి వాటం వ్యక్తి రాత లాగ ఉంది. దీంతో శ్రీనివాస్ రెడ్డి మృతి వెనుక ఎవరు ఉన్నారో తేలితే వివేకానందరెడ్డి హత్య కేసులో మిస్టరీ వీడినట్లేనని సిట్ బృందం భావిస్తున్నట్టు సమాచారం. శ్రీనివాసరెడ్డి అనుమానస్పద మృతి కేసును సింహాద్రిపురం పీఎస్ కు బదిలీ చేయడంతో పురోగతి కనిపిస్తోందని దర్యాప్తు సంస్థ భావిస్తోంది. ఎంతటి కరుడు గట్టిన నేరగాడైన ఎక్కడో ఒక చోట పొరపాటు చేస్తాడనీ శ్రీనివాసరెడ్డి అనుమానస్పద మృతి తమకు అందివచ్చిన ఆయుధంగా సిట్ విశ్వసిస్తున్నట్టు తెలిసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: