ఇటీవ‌లి కాలంలో...కులాంత‌ర‌- మ‌తావంత వివాహాలు అధికంగా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. వీటి వెనుక కుట్ర ఉంద‌ని కొంద‌రు ఆరోపిస్తుండ‌గా....స‌మ‌స‌మాజానికి దారితీస్తున్నాయ‌ని ఇంకొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా ఈ విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఓ మతాంతర వివాహానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా సుప్రీం స్పందిస్తూ...మతాంతర, కులాంతర వివాహాల కు తాము వ్యతిరేకంకాదని, ఇలాంటి పెళ్లిళ్లు సోషలిజానికి (సమసమాజానికి) తోడ్పడుతాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే కొంతమంది దురుద్దేశంతో ఇలాంటి వివాహాలు చేసుకుని, ఆ తర్వాత భార్యను వదిలేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.


ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక ముస్లిం యువకుడు(33) గతేడాది హిందూ యువతిని (23) వివాహం చేసుకున్నాడు. ఇందుకోసం అతడు హిందూ మతాన్ని స్వీకరించాడు. అయితే వివాహం తర్వాత అతడు తిరిగి ఇస్లాం స్వీకరించాడని యువతి తండ్రి ఆరోపించారు. ఇదంతా కుట్ర అని, మతాంతర వివాహాల ముసుగులో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దంపతులిద్దరూ కలిసి ఉండేందుకు హైకోర్టు అనుమతివ్వడంతో ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. 


అమ్మాయి తండ్రి తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. మతాంతర పెండ్లి ముసుగులో ఒక రాకెట్ నడుస్తున్నదని, దీనిపై సుప్రీంకోర్టు దృష్టిసారించాల్సిన అవసరం ఉన్నదని కోరారు. యువకుడి తరఫున సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది, యువ తి తరఫున గోపాల్ శంకర్‌నారాయణ్ వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో విచారణ అవసరం లేదని పేర్కొంటూ కేరళకు చెందిన హదియా కేసులో సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించారు. దీనికి జస్టిస్‌లు అరుణ్ మిశ్రా, ఎంఆర్ మిశ్రాతోకూడిన ధర్మాసనం స్పందిస్తూ.. తాము ఈ వివాహంపై విచారణ చేయదలచుకోలేదని, కేవలం యువతి ప్రయోజనాలను కాపాడాలనుకుంటున్నామని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా యువకుడిని మంచి భర్తగా, గొప్ప ప్రేమికుడిగా ఉండాలని సూచించింది. పెండ్లి అనంతరం చట్టప్రకారం పేరు మార్చుకున్నారా? అని ప్రశ్నించింది. మతాంతర వివాహాలకు మేం వ్యతిరేకం కాదు. హిందూ-ముస్లిం వివాహాలూ సమ్మతమే. చట్ట ప్రకారం వారు పెండ్లి చేసుకుంటే, సమస్యలు ఎందుకొస్తాయి? అని  ధర్మాసనం ప్రశ్నించింది. కేసుపై రాష్ట్ర ప్రభుత్వ స్పందన కోరుతూ తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: