టిఆర్ఎస్ నాయకత్వానికి ధిక్కార  స్వరాన్ని వినిపిస్తున్న బోధన్ ఎమ్మెల్యే షకీల్ ను  పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి రంగం సిద్దమైందా ? అంటే అవుననే ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి .  పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే తరువాయి ... శాసనసభ్యుడిగా అయన పై  అనర్హత వేటు వేయాల్సిందిగా  స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ని కలిసి  టీఆర్ఎస్ ఎల్పీ ప్రతినిధి బృందం కోరనున్నట్లు తెలుస్తోంది .  మరో నాలుగున్నరేళ్ల కాలం పాటు  శాసనసభ్యుడిగా కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ,  పార్టీ ఫిరాయించాలని  భావిస్తున్న షకీల్ ను ఈ బడ్జెట్  అసెంబ్లీ సమావేశాల్లోగానే  అనర్హుడిగా ప్రకటించే విధంగా టిఆర్ఎస్ నాయకత్వం వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం .


 షకీల్ పై అనర్హత వేటు వేయడం ద్వారా పార్టీ  ఫిరాయించాలనుకునే ఎమ్మెల్యేలు, వెనుకంజ వేసే అవకాశాలు ఉంటాయని టిఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి .  కేబినెట్ విస్తరణ అనంతరం మంత్రి పదవి  దక్కలేదని పలువురు శాసనసభ్యులు  అసమ్మతి గళం వినిపించగా ,  ఒకరిద్దరు ఎమ్మెల్యేలు  అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం తెలిసిందే . అసంతృప్తి  గళం వినిపించిన  వారిని, అజ్ఞాతం లోకి వెళ్లిన వారిని  పార్టీ నాయకత్వం బుజ్జగించి దారి  తెచ్చుకుంటున్న తరుణంలో,  నిజామాబాద్  ఎంపీ అరవింద్ తో  షకీల్  భేటీ కావడం  రాజకీయంగా కలకలాన్ని రేపింది . తాను పార్టీ లో  కొనసాగే పరిస్థితి లేదని ఆత్మాభిమానం చంపుకుని టిఆర్ఎస్ లో కొనసాగలేనని షకీల్  చేసిన వ్యాఖ్యలు,  ఆయన పార్టీ మారడం ఖాయమని తేటతెల్లం చేస్తున్నాయి.


ఈ  నేపథ్యంలో షకీల్ ను  బుజ్జగించడం కంటే ఆయనపై సస్పెన్షన్ వేటు వేయడం ద్వారా పార్టీ మారాలనుకునే వారికి గట్టి హెచ్చరికలు పంపాలని  టిఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది .


మరింత సమాచారం తెలుసుకోండి: