చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేసినప్పటికీ,  వైకాపా అరాచక  రాజకీయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం చేయడం లో సక్సెస్ అయ్యామని  తెలుగుదేశం పార్టీ నేతలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.  ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లోనూ  వైకాపా అరాచకాలకు బలైన బాధిత టీడీపీ కార్యకర్తలకు అండగా నిలువాలని నిర్ణయించారు .  పల్నాడు గ్రామాల తో సహా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు , నాయకులపై వైకాపా అధికారం లోకి వచ్చిన తరువాత  జరిగిన దౌర్జన్య కాండపై  శుక్రవారం డిజిపిని కలిసి వినతిపత్రం అందజేయాలని టిడిపి నాయకత్వం నిర్ణయించింది.


 రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు , నాయకులపై జరిగిన దౌర్జన్య కాండపై సవివరమైన  ఆధారాలతో ప్రచురించిన రెండు పుస్తకాలను కూడా డీజీపీ కి  అందజేయాలని  పార్టీ నేతలకు, టీడీపీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. వైకాపా అధికారం లోకి వచ్చిన తరువాత టీడీపీ కార్యకర్తలు , నాయకులపై దౌర్జన్యాలు పెరిగాయని , వారు గ్రామాల్లో ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తోన్న ఆ పార్టీ నాయకత్వం, ఇదే విషయాన్ని  గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లి  వినతిపత్రం అందించాలని నిర్ణయించింది .


 అంతటితో ఆగకుండా వైకాపా ప్రభుత్వ హయాం లో,  తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పై కొనసాగుతున్న అరాచకాలు,  దౌర్జన్యాలు,  అన్యాయాలపై ప్రైవేట్ కేసులు వేయడం ద్వారా పార్టీ క్యాడర్ కు అండగా నిలువాలని  పార్టీ నేతలకు చంద్రబాబు చెప్పారు. ప్రధానంగా   టీడీపీ కార్యకర్తలపై బనాయించిన అక్రమ కేసులు తొలగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేవిధంగా   క్షేత్రస్థాయి లో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు .  టీడీపీ కార్యకర్తల ను లక్ష్యంగా చేసుకుని వైకాపా ప్రభుత్వం అక్రమ ఎస్సీ ఎస్టీ కేసులను బనాయిస్తోందన్న ఆయన , ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను  సమీక్షించే విధంగా న్యాయపోరాటం చేయాలని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: