చేసింది కొంతే... చేయాల్సింది చాలా ఉంది..! పిక్చర్‌ అభీ బాకీహై..! వంద రోజుల పాలనపై ప్రధాని మోడీ చేసిన కామెంట్లివి. జార్ఖండ్‌లో పర్యటించిన మోడీ.. అసెంబ్లీతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు శంఖారావం పూరించారు ప్రధాని మోడీ. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ రానుండటంతో... అన్ని పార్టీల కంటే ముందే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. మోడీ చేతుల మీదుగా క్యాంపైన్‌కు శ్రీకారం చుట్టింది. 


కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధాన మంత్రి కిసాన్‌ మందన్‌ యోజనను ప్రారంభించారు మోడీ . ఈ పథకం రైతులందరికీ పింఛన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో పాటు ఆర్టికల్ 370 రద్దును ప్రస్తావించారు. ఇప్పటి నుంచి కాశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమైందన్నారు. జమ్మూకాశ్మీర్‌తో పాటు లడఖ్‌ను అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు మోడీ.


ప్రధాని మోడీ వందరోజుల పాలనపై స్పందించారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక చేసింది కొంతేనని, ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు. పిక్చర్‌ అభి బాకీహై అంటూ కేంద్ర లక్ష్యాలను వివరించారు. ఇటు రాంచీలో జార్ఖండ్‌ విధాన సభను ప్రారంభించారు ప్రధాని. ఆ రాష్ట్ర సీఎంతో కలిసి సభలో కలియతిరిగారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. గిరిజనుల కోసం 462 ఏకలవ్య విద్యాలయాలకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. 


జార్ఖండ్‌లో మొత్తం 77 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2014 ఎన్నికల్లో 35 స్థానాలు గెలిచి బీజేపీ.. లోకల్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఐతే..ఈసారి కాంగ్రెస్‌, జార్ఖండ్‌ ముక్తిమోర్చ కలిసి పోటీ చేస్తున్నాయి. ఐతే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 14 ఎంపీ స్థానాలకు.. 12 సీట్లను కైవసం చేసుకుంది. ప్రధాని మోడీ మాత్రం అందరికంటే ముందస్తు వ్యూహంతో జార్ఖండ్ లో ఎన్నికల సమరానికి సిద్ధమైపోయారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: