కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మోటారు వాహన చట్టంతో వాహనదారులపై పిడుగుపడినట్లైంది. భారీ జరిమానాలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. వేలకు వేలు ఫైన్లు వేస్తుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే భారీ జరిమానాల నుంచి గుజరాత్‌ రాష్ర్ట ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇప్పుడు ఇదే బాటలో కర్నాటక కూడా చేరింది. మరికొన్ని రాష్ర్టాలు కూడా కొత్త మోటార్‌ వాహన చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 


కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వాహన చట్టం దేశవ్యాప్తంగా విమర్శల పాలవుతోంది. భారీ చలానాల పేరుతో సామాన్య... మధ్యతరగతి వాహనదారుల జేబులు గుల్ల చేసే ఈ చట్టంపై జనం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కొత్త ట్రాఫిక్‌ చలానాలపై పెద్ద దుమారమే చెలరేగుతోంది. ఇప్పటికే  కొన్ని రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చిన నూతన విధానాన్ని తప్పు పడుతూ వాహనదారులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. 


మోటారు వాహనాల చట్టం కొత్త నిబంధనలు వచ్చాక జరిమానాల రూపంలో ప్రజల జేబుకు భారీగా చిల్లు పడుతోంది. ఈ క్రమంలో కేంద్రం విధించిన భారీ జరిమానాల బారి నుంచి గుజరాత్‌ ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. ఇప్పుడు ఇదే కోవలోకి బీజేపీ పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, గోవా, కర్ణాటక ప్రభుత్వాలు కూడా చేరాయి.  కేంద్రం ఈ విషయంపై పునరాలోచించకపోతే,  తామే జరిమానాలు తగ్గిస్తామని ప్రకటించాయి. ప్రస్తుతం ఉన్న జరిమానాలు ప్రజల మీద పెను భారం పెంచుతున్నాయని అభిప్రాయపడ్డాయి. ఇవేకాకుండా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, కేరళ, ఢిల్లీ కూడా ఇదే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇక పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం ఇప్పటికే ఈ జరిమానాల అంశాన్ని తిప్పి కొట్టింది. 


ఇక కన్నడ ప్రభుత్వం కూడా గుజరాత్‌ బాటలో నడిచింది. నూతన మోటారు వాహన చట్టంతో వాహనదారులపై భారీ జరిమానాలు పడుతున్నాయి. రవాణా అధికారులు, ట్రాఫిక్‌ పోలీసులు 5 వేల నుంచి 50 వేల రూపాయల వరకు చలానాలు రాస్తున్నారు. దీనిపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుండడంతో గుజరాత్‌ మాదిరిగా కన్నడనాట కూడా చలాన్లను సగానికి తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం బీఎస్‌ యడియూరప్ప ఈ విషయమై రవాణాశాఖ అధికారులకు సూచనలు చేశారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ట్రాఫిక్ నిబంధనలే కర్ణాటకలోనూ అమలు చేస్తామని ముఖ్యమంత్రి యడియూరప్ప తెలిపారు. ఇతర రాష్ట్రాలలో విధిస్తున్న జరిమానాల విధానాన్ని కర్ణాటక అధికారులు అధ్యయనం చేశారు. రెండు రోజుల్లో సంపూర్ణ నివేదికను సీఎంకు అందజేయనున్నారు. ఆ తరువాత జరిమానాలను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.


ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు భారీ జరిమానాలు విధించడాన్ని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్పుబట్టారు. ఇవి మరీ కఠినంగా ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకమని, వీటిని తమ రాష్ట్రంలో అమలు చేయబోమని స్పష్టంచేశారు. జరిమానాలు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదని, మానవతా దృక్పథంతో చూడాలన్నారు మమతా. కేంద్ర ప్రభుత్వం పెంచిన ట్రాఫిక్‌ జరిమానాలను తగ్గిస్తే రాష్ట్రాలే బాధ్యత వహించాలని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఇంతకుముందే ప్రకటించారు. ఫిక్‌ నిబంధలను అతిక్రమించే వారికి విధించే జరిమానాలు తగ్గిస్తే.. ఆ తర్వాత పరిణామాలకు ఆయా రాష్ట్రాలే బాధ్యత తీసుకోవాలన్నారు.  జరిమానాలు విధించి డబ్బు రాబట్టడం కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం కాదని, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తీసుకున్న నిర్ణయమని కూడా స్పష్టం చేశారు గడ్కరీ. 





మరింత సమాచారం తెలుసుకోండి: