పీవీ సింధు.. అచ్చ తెలుగు ఆడపడుచు.. కేంద్రం అందించే ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డు అందుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్ షిప్ సాధించిన ప్రముఖ క్రీడాకారిణి పివి సిందు కు పద్మ భూషణ్ ఇవ్వాలని క్రీడా మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. మరో ప్రఖ్యాత క్రీడాకారిణి మేరి కోమ్ కు పద్మ విభూషణ్ కోసం ప్రతిపాదించారు. పద్మశ్రీ అవార్డుకు అర్హులుగా మరో తొమ్మిది మంది క్రీడాకారుల పేర్లను పంపింది. వీరిలో ఏడుగురు మహిళలే ఉండడం విశేషం.


పద్మ అవార్డులను కేంద్రం గణతంత్ర దినోత్సవ సందర్భంగా అధికారికంగా ప్రకటిస్తుదంి. దీని కోసం వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలను స్వీకరిస్తుంది. ఇందులో భాగంగా క్రీడా మంత్రిత్వ శాఖ తన ప్రతిపాదనలను పంపింది. మన పీవీ సింధు నాలుగేళ్ల క్రితమే పద్మ అవార్డును సొంతం చేసుకుంది. ఇటీవల పీవీ సింధు బీడబ్ల్యూ ఎఫ్ ప్రపంచ చాంపియన్ షిప్ సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇలా బ్యాడ్మింటన్ లో భారత మహిళ ప్రపంచ చాంపియన్ షిప్ సాధించడం గత 70 ఏళ్లలో ఇదే తొలిసారి.


ఈ ఘనత సాధించినందుకే ఈసారి పీవీ సింధును పద్మభూషణ్ వరించబోతోంది. కేంద్రం ఈ సిఫారసును అంగీకరిస్తే... చిన్న వయస్సులోనే పద్మ భూషణ్ అందుకున్న ఘనత సింధు సొంతమవుతుంది. పుల్లెల గోపీచంద్ సారథ్యంలో పీవీ సింధు బ్యాడ్మింటన్ లో అంచెలంచెలుగా ఎదిగింది. గతంలో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో ఆడినా ప్రపంచ చాంపియన్ షిప్ దక్కలేదన్న కొరత మొన్నటి వరకూ ఉండేది. గతంలో మూడు సార్లు ఫైనల్ వరకూ వెళ్లినా విజయం వరించలేదు.


ఇటీవల స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన పోటీల్లో సింధు కల నెరవేరింది. ప్రపంచ చాంపియన్ షిప్ గెలుచుకున్న పీవీ సింధు భారత పతాకాన్ని సగర్వంగా ఎగరేసింది. పీవీ సింధు కృషిని గతంలోనే గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: