జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను మంత్రులు లెక్క చేస్తున్నట్లు లేదు చూస్తుంటే. పరిపాలనా సంబంధిత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని జగన్ స్పష్టంగా మంత్రులు, ఎంఎల్ఏలకు ఆదేశాలిచ్చారు. మిగిలిన జిల్లాల్లో పరిస్ధితులు ఎలాగున్నాయో తెలీదు. తాజాగా కృష్ణా జిల్లాలో వెలుగు చూసిన ఘటన మాత్రం జగన్ ఆదేశాలను మంత్రులు లెక్క చేయటం లేదనే అనిపిస్తోంది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే, కృష్ణా జిల్లాలోని ఓ మండల పాఠశాల హెడ్ మాస్టర్ గా ఓ టీచర్ కు ప్రమోషన్ ఇచ్చారు. అయితే రెండు రోజుల్లోనే ఆ ఆర్డర్ ను సవరించి మరో టీచర్ కు ప్రమోషన్ ఇస్తు ఆర్డర్ జారీ అయ్యింది. దాంతో టీచర్ల అసోసియేషన్ నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది.

 

పదోన్నతుల్లో అక్రమాలు, టీచర్ల సంఘాల నిరసన అన్నది మామూలే. కానీ ఇక్కడ ఆందోళనలో ఉన్న టీచర్లను ఉద్దేశించి డిఇవో చెప్పిన విషయాలే ఆశ్చర్యంగా ఉంది. మొదటి టీచర్ కు ప్రమోషన్ ఇవ్వాలంటూ ఇద్దరు మంత్రులు తనపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చినట్లు డిఇవో బహిరంగంగానే చెప్పారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేకే తప్పని తెలిసినా ప్రమోషన్ ఇచ్చినట్లు ఒప్పుకున్నారు.

 

సరే ఆ తర్వాత మళ్ళీ వచ్చిన ఒత్తిడి మేరకే మొదటి ఆర్డర్ ను రద్దు చేసి కొత్తగా మరో ఆర్డర్ ఇచ్చారు. దాంతో మంత్రులు మళ్ళీ ఒత్తిళ్ళు మొదలుపెట్టినట్లు డిఇవో చెప్పటమే జిల్లాలో  చర్చకు దారితీసింది. డిఇవో చెప్పింది చూస్తుంటే మంత్రులతో పాటు ప్రజా ప్రతినిధుల జోక్యం చాలా ఎక్కువగానే ఉన్నట్లు అర్ధమవుతోంది. ఎక్కడైనా అర్హులకు అన్యాయం జరిగితే న్యాయం చేయటానికి మంత్రులో, ప్రజా ప్రతినిధులో జోక్యం చేసుకోవటంలో తప్పు లేదు. కానీ నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషన్లు ఇప్పించుకునే స్ధాయిలో మంత్రులు ఒత్తిళ్ళు పెడుతున్నారంటే పరిపాలనలో జోక్యం ఏ స్ధాయిలో ఉందో అర్ధమవుతోంది. డిఇవో మంత్రుల పేర్లు చెప్పకపోయినా జిల్లాలో ఉన్నదే కొడాలి నాని, పేర్ని నాని అన్న విషయం అందరికీ తెలిసిందే.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: