భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రుని ఉపరితలం మీద ప్రయోగాలు నిర్వహించడానికి పంపిన చంద్రయాన్ 2 చంద్రుని మీద దిగే కొద్ది క్షణాల్లో కమ్యూనికేషన్ కట్ అవడం అందరినీ నిరాశ పరిచింది. అహర్నిశలు శ్రమించి, సెలవులు కూడా పెట్టకుండా ఆ ప్రయోగం మీదే పని చేసిన శాస్త్రవేత్తలకి చంద్రయాన్ 2  కనెక్షన్ కట్ అవడం కోలుకోలేని దెబ్బ. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిలోకి 28 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇంకా 2.1 కిలోమీటర్ల దూరంలో ఉందనగా విక్రమ్ ల్యాండర్ ఆచూకీ మిస్సయింది.


చంద్రుని ఉపరితలంపై ప్రయోగాలు చేద్దామనుకుని తమ లక్ష్యాల్ని చేరలేకపోయినందుకు ఇస్రో ఛైర్మన్ కె శివన్ దుఃఖం ఆపుకోలేక ఏడ్చేశాడు. ప్రధాని మోదీ సహా దేశ ప్రజానీకం అంతా శాస్త్రవేత్తలకి అండగా నిలిచారు. రోదసిలో 3,84,400 కిలోమీటర్ల వరకు విక్రమ్ ల్యాండర్ ను తీసుకెళ్లడం  సాధారణ విషయం కాదని, అది కూడా ఒక విజయమేనని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు సైతం మన ఇస్రో సిబ్బందిని ప్రశంసించారు. మరి అంతటి ప్రతిభాపాటవాలు ఉన్న మన శాస్త్రవేత్తల జీత భత్యాల విషయంలో కేంద్రం వ్యవహరించే తీరు శాస్త్రవేతలని ఇబ్బంది పెడుతుంది.


ఇందులో పనిచేసే సిబ్బందికి ఏడాదికి 1.5 లక్షల నుండి 6.12 లక్షల రూపాయల వరకు మాత్రమే వేతనాలను చెల్లిస్తుంది. డ్రాయింగ్ లను విశ్లేషించి మ్యాప్ లను రూపొందించే సివిల్ ఇంజనీర్లకు ఏడాదికి 2.20 లక్షల నుమ్డి 6.12 లక్షల రూపాయల వరకు చెల్లిస్తుంది. టెక్నికల్ అసిస్టెంట్ కు ఏడాదికి 2.36 లక్షల నుండి 6 లక్షల వరకు వస్తున్నాయి. ఎక్కువ పని ఉండే ఫిట్టర్ కు ఏడాదికి 1.53 లక్షల నుండి 4.5 లక్షల వరకు వస్తున్నాయి. ఐఐటీల్లో చదువుకుని ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేసే ఉద్యోగులకు 9 లక్షల నుండి 12 లక్షల వరకు వస్తుంటే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇస్రోలో పని చేసే వారికి మాత్రం ఈ రేంజ్ లో వేతనాలు చెల్లించడం ఆశ్చర్యంగా ఉంది.


అదీ గాక ఇస్రోలో ప్రతీ ఏటా సిబ్బందికి పదివేల రూపాయలు బోనస్ గా ఇచ్చే సంప్రదాయం ఉంది. ఈ సంప్రదాయం 1996 నుండి అమల్లో ఉంది. సిబ్బందిని ప్రోత్సహించేందుకే ఇలా బోనస్ ఇస్తున్నారు. జులై ఒకటవ తేదిన కేంద్ర ప్రభుత్వ సర్క్యులర్ ప్రకారం ఇక ముందు ఎలాంటి బోనస్ ఉండదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. జులై 15 వ తేదీన చంద్రయాన్ ప్రయోగం జరుగుతున్న నేపథ్యంలో ఈ సర్క్యులర్ రావడంతో దాని ప్రభావం సిబ్బంది మనసులపై  పడి ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.


1996 నుండి వస్తున్న దాన్ని హఠాత్తుగా ఆపివేయడంతో సిబ్బంది షాక్ తిన్నారు. దేశ భక్తి గురించి అనుక్షణం ఊదరగొట్టే కేంద్ర ప్రభుత్వం దేశం కోసం పనిచేసే ఇస్రో సిబ్బంది పట్ల వ్యవహరించిన తీరు బాగాలేదని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కేవలం అద్భుతాలు ఆశిస్తే సరిపోదు. అందుకు సరిపడా సౌకర్యాలు కూడా కల్పించాలి అనే విషయం కేంద్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: