ఈ మధ్యకాలంలో కాకి లెక్కల వ్యాపారుల ఆటలు సాగడం లేదు.వారు చేసే వ్యాపారంలో,గడించే లాభాలకు లెక్క చూపకుండా దాచుకునేందుకు ఇదివరకు వరకు ఎన్నో మార్గాలు ఉండేవి.అందులో అవకాశం ఉన్నంత వరకూ నష్టాలు వస్తున్నట్లు చూపించి ప్రభుత్వానికి లెక్క చెప్పకుండా పెద్దమొత్తంలో వెనకేసేవారు.కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వస్తు సేవల పన్నుతో అక్రమంగా సంపాదించే వారి ఆటలకు అడ్డుకట్ట పడ్డది.ఎలాగంటే నిర్ణిత అమౌంట్ దాటిన ప్రతి వ్యాపారి వారు చేసే వ్యాపారంలోని ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సిందే.కొంతమందికి తప్పించుకోవడానికి చూసినా కుదరడం లేదు.అందుకే కొత్త ప్లాన్ వేసి తప్పుడు ఇన్‌వాయిస్ బిల్లులను పెట్టి,జీఎస్టీ రిఫండ్‌లను పొందారు.ఇప్పుడు వారిపై జీఎస్టీ ఇంటెలిజెన్సీ కళ్లు పడ్డాయి.



దొంగ ఇన్‌వాయిస్ బిల్లులను పెట్టిన పలు సంస్థలపై డైరక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్సీ,డైరక్టరేట్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ లు కలిసి దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించాయి.వారికి అందిన సమాచారం ప్రకారం కొందరు ఎగుమతిదారులు తప్పుడు పద్ధతుల్లో జీఎస్‌టీ రిఫండ్‌ను కోరుతున్న నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహించారట.. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1200 మంది అధికారులు పాల్గొన్న ఈ తనిఖీల్లో కొందరు వ్యాపారులు రూ.3500 కోట్ల విలువైన ఇన్‌వాయిస్‌లపై రూ.470 కోట్లు అక్రమంగా ఐటీసీ రూపేణ పొందినట్లు ప్రాథమిక పరిశీలనలో గుర్తించారు.అంతేగాకుండా ఎగుమతిదార్లు మళ్లీ వీటినే ఐటీసీ రూపంలో ఐజీఎస్‌టీ చెల్లించినట్లు ఆధారంగా,చూపి,రిఫండ్‌ కూడా సాధించారట.



ఇక ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ పొందేందుకు అర్హత లేని,నకిలీ సరఫరాలతో కొందరు వస్తువూలను ఎగుమతులు చేసినట్లు గుర్తించారు.తెలంగాణతో సహా మొత్తం 15 రాష్ట్రాల్లో 336చోట్ల ఏకకాలంలో జరిపిన దాడుల్లో ఇన్ని అవకతవకలు బయట పడ్డాయి. ఇక  ముఖ్యంగా హైదరాబాద్‌, సికింద్రాబాద్‌,బేగంబజార్‌ ప్రాంతాల్లో ముగ్గురు మొబైల్‌ డీలర్లకు చెందిన 8 కార్యాలయాల పై దాడులు జరిపి ఇన్‌వాయిస్‌ బిల్లులను పరిశీలించారు.కాగా,సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ టాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ (సీబీఐసీ) విభాగాలు రెండూ సంయుక్తంగా ఇంత భారీఎత్తున తనిఖీలు చేయడం ఇదే తొలిసారట.ఇన్ని దాడులు జరిపి వ్యాపార సంస్దలను సీజ్ చేసిన వ్యాపారుల్లో మార్పు అనేది కనబడుతుందా అంటే అదిలేదు.షరా మాములే అవినీతి వారికి కట్టుకున్నపెళ్లంలా అయ్యింది అందుకే మానలేక పోతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: