గోదావరి వరదలు లంక గ్రామాల ప్రజలకు కన్నీళ్లనే మిగిల్చాయి. కొద్ది రోజుల పాటు రహదారులు, ఇళ్లు నీటమునగటంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం గోదావరికి వరద ప్రవాహం తగ్గడంతో ముంపు ప్రాంతాల ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. పోలవరం ముంపు ప్రాంతాలు, కోనసీమ లంక గ్రామాల్లో పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి.  కష్టాల నుంచి వరద బాధితులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఐతే...ఒకే సీజన్లో గోదావరికి మూడు సార్లు భారీ వరదలు రావటంతో జనం గతంలో కంటే ఎక్కువ ఇబ్బందులు పడాల్సి వచ్చింది. 


ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సీజన్ లో గోదావరికి వరుసగా మూడుసార్లు  వరదలు వచ్చాయి. గడిచిన నలభై రోజుల వ్యవధిలోనే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మూడుసార్లు గోదావరి వరద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటింది. 2013 తర్వాత ఎక్కువ రోజుల పాటు గోదావరి ఉగ్రరూపం కొనసాగుతున్న పరిస్థితి ఈ సంవత్సరంలోనే కనిపిస్తోంది. వరదలతో తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం ఏజెన్సీ నుంచి కోనసీమలోని లంకల వరకూ సుమారు వంద గ్రామాలు జలదిగ్బందంలో చిక్కుకున్నాయి. ఇక...గోదావరి వరద మరోసారి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటడంతో బాధితుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. 


కొద్ది రోజుల క్రితం వరద నీరు పోటెత్తటంతో దేవీపట్నం ఏజెన్సీలోని 36 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 18 గ్రామాల్లో సుమారు వెయ్యికి  పైగా ఇళ్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. రహదార్లు... విద్యుత్ లైన్ లు నీట మునగటంతో వరద గ్రామాలకు  కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా బాధితులకు తాగు నీరు సైతం అందే పరిస్థితి లేకుండాపోయింది. కొందరు పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకున్నారు. మరికొందరు  మాత్రం ఇళ్లను వదిలి రాలేక దేవీపట్నం మండలంలో కొండలపైన,  బిల్డింగులపైన గుడారాలు వేసుకొని  బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. 


మరోవైపు...గోదావరి నదీపాయలు ఉద్ధృతంగా ప్రవహించాయి. దీంతో కోనసీమలోని లంక గ్రామాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. రాజోలు మండలం అప్పన రామునిలంక తదితర గ్రామాల్లో ఇళ్లన్నీ జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. బయటకు వెళ్లే మార్గం లేక బాధితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాజ్ వే లు మునిగిపోయి లంక గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. పడవల సహాయంతోనే వరద బాధితులు ప్రయాణాలు సాగించారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని రోజుల తరబడి భయంతోనే గడిపారు.  మరోవైపు...కోనసీమలోని రావులపాలెం మండలం ఊబలంక పంచాయితీలోని  తోకలంక గ్రామ ప్రజలు  ఇంకా జలదిగ్బంధంలోనే చిక్కుకున్నారు. ఇటుక బట్టీల కోసం మట్టిని అక్రమంగా తరలించుకుపోవడంతో  నీట మునిగి రహదారులు కోతకు గురయ్యాయి. ఇదే పరిస్థితి కొనసాగితే  తోకలంక గ్రామం కనుమరుగైపోయే ప్రమాదం ఉంది.  


ఇక ప్రస్తుతం గోదావరికి వరద తగ్గుముఖం పట్టి సాధారణ స్థాయికి చేరుకుంటోంది. దీంతో పునరావాస కేంద్రాల నుంచి బాధితులు ఇళ్లకు  చేరుకుంటున్నారు. బురదమయమైన ఇళ్లు, రహదారులను శుభ్రం చేసుకుంటున్నారు. ఏది ఏమైనా గత కొన్నేళ్లలో లేని విధంగా గోదావరికి వస్తున్న వరుస వరదలు బాధితులకు కన్నీళ్లను మిగిల్చాయి.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని లంక గ్రామాల ప్రజలు కోరుతున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: