ఏపీ రాజధాని అమరావతి విషయంలో ఎడతెగని చర్చ సాగుతోంది. అమరావతి మీద నిన్న కూడా మంత్రి బొత్స సత్యనారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. అమరావతి పేరు మీద గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయలేదని నాటి టీడీపీ సర్కార్ ని ఆయన విమర్శించారు. ఇక అమరావతి రాజధాని శాపగ్రస్థ అంటూ కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ కూడా క్లారిటీగా చెప్పేస్తున్నారు. తిరుపతి రాజధాని చేయమని ఆయన కోరుతూంటే, కర్నూల్లో రాజధాని పెట్టాలని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ డిమాండ్ చేస్తున్నారు.


మరో వైపు అమరావతి రాజధానిని తరలిస్తే చూస్తూ వూరుకోమని టీడీపీ, జనసేన గట్టిగానే చెబుతున్నాయి. అమరావతి నిర్మాణానికి ఏడు కోట్ల రూపాయల వ్యయం అయిందని, ప్రతీ ప్రభుత్వం వస్తూనే రాజధాని మార్చ‌డానికి ఇదేమైనా చిన్న పిల్లాట  అంటూ పవన్ గర్జిస్తున్నారు. రాజధానిని మార్చితే ఏడువేల కోట్ల రూపాయల మొత్తాన్ని మంత్రి బొత్స ఇస్తారా అంటూ ఆయన సెటైర్లు కూడా వేస్తున్నారు.


ఈ నేపధ్యంలో జగన్ వచ్చే వారం అమరావతి విషయం తేల్చేయడానికి మంత్రి మండ‌లితో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా అమరావతి రాజధాని గురించి, అక్కడ నిర్మాణాలను గురించి మాత్రమే జగన్ మంత్రులతో చర్చిస్తారని సమాచారం. అమరావతిలో నిర్మాణాల పరిస్థితి ఏంటి, వాటిని కొనసాగించే విషయంలో కూడా మంత్రిమండలి సమావేశం తరువాత క్లారిటీ వస్తుందని అంటున్నారు.


అదే విధంగా రాజధాని నిర్మాణం విషయంలో జరిగిన ఒప్పందాలపైన కూడా మంత్రివర్గం ద్రుష్టి సారించనుంది. వాటిలో అవకతవకలు ఏమైనా  ఉంటే తిరగతోడాలని కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద చూసుకుంటే మంత్రి వర్గం ప్రత్యేకంగా అమరావతి రాజధాని మీదనే చర్చించనుండడంతో అందరి ద్రుష్టి క్యాబినెట్ మీటింగ్ మీద పడింది.



మరింత సమాచారం తెలుసుకోండి: