విశాఖ మన్యంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల  కారణంగా ఏజెన్సీలో జనజీవనం స్తంభించిపోయింది. లంబసింగి ఘాట్ లో కొండచరియలు విరిగిపడ్డాయి. విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షం సమయంలో ప్రయాణం అంటేనే జనం భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు...తురపాడ గెడ్డ పొంగి పొర్లుతోంది. దీంతో నర్సీపట్నంభద్రాచలం అ౦తర్ రాష్ట్ర రహదారిలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. 


ఉపరితల ఆవర్తన ప్రభావంతో విశాఖ ఏజెన్సీలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తో౦ది. వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు మన్యంలో అతి పెద్దదైన లంబసింగి ఘాట్‌ రహదారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. బోడకొండమ్మ ఆలయం సమీపంలో మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. కొండచరియలు రహదారిమీదకి వచ్చి పడటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారు. మట్టిపెళ్లలు విరిగిపడటంతో ఆ రహదారిలో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులు, వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రయాణీకులు కిందకు దిగి రోడ్డుపై పడిన రాళ్ళు, మట్టి పెళ్లలను తొలగించారు. సుమారు గంట తరువాత ఈ రహదారిలో రాకపోకలకు వీలు కలిగింది. 


ఇక...అదే సమయంలో లంబసింగి ఘాట్‌ రోడ్డు దిగువ భాగంలో సమ్మగిరి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న తురపాడ గెడ్డకు కొండవాగుల నుంచి నీటి ప్రవాహం భారీగా వచ్చి చేరుతోంది. గెడ్డ ఉప్పొంగి ప్రవహిస్తోంది. లోతట్టు వంతెన కావడంతో వర్షపు నీరుతో వంతెన సైతం మునిగిపోయింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణాకు వెళ్లే రహదారి ఇదే కావడంతో నిత్యం అనేక వాహనాలు ఈ దారిలోనే రాకపోకలు సాగిస్తుంటాయి. వర్షాలు పడినప్పుడు వంతెన మీద నుంచి నీరు ప్రవహిస్తుంటుంది. ఫలితంగా రాకపోకలు నిలచిపోతున్నాయి. వర్షాలు కురిసినప్పపుడల్లా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  


మరోవైపు...ఆంధ్రా ఒడిశా సరిహద్దులో చాలా చోట్ల కల్వర్టులు, తాత్కాలిక వంతెనలు వర్షాలకు కొట్టుకుపోయాయి. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ఇక్కడ శాశ్వత వంతెనలు నిర్మాణం జరగడంలేదు. దీంతో గ్రామస్తుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు, ప్రజల భాగస్వామ్యంతో పునరుద్ధరణ పనులు చేపట్టారు. ముంచంగిపుట్టు నుంచి కుమడా వెళ్ళే రహదారి నిర్మాణం చేపట్టారు. మొత్తానికి...విశాఖ మన్యాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రహదారులు కొట్టుకుపోవటంతో విశాఖ ఏజెన్సీలోని చాలా గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: