ఏపీలో విపక్ష తెలుగుదేశం పార్టీకి దిమ్మతిరిగిపోయే షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నే,త మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పార్టీకి రాజీనామా చేస్తారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలను నిజం చేస్తూ తోట శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే ఆయన ఈనెల 18వ తేదీన వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. శుక్రవారం రామచంద్రపురం లో పార్టీ అభిమానులు.. కార్యకర్తలతో భేటీ అయిన తోట టీడీపీని వీడుతున్నట్టు చెప్పారు. ఈ నెల 18వ తేదీన వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు.


రెండున్నర దశాబ్దాలుగా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు తనను గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఆద‌రించార‌ని... తాను ఎప్పుడూ నియోజకవర్గ ప్రజల మనసులను గెలిచినట్టు ఆయన చెప్పారు. టిడిపిని వీడిన‌ తోట ఆ పార్టీతో పాటు... పార్టీ అధినేత చంద్రబాబు పై తీవ్రమైన విమర్శలు చేశారు. టిడిపి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం జీవో ఇచ్చినా ప్రభుత్వం నుంచి నిధులు రాలేదని ఫైర్ అయ్యారు. గత ఎన్నికల్లో తన ఓటమికి టీడీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా ఓ కారణం అని చెప్పారు.


నియోజకవర్గ అభివృద్ధి కోసం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును నిధులు ఇవ్వాలని కోరినా ఆయన పట్టించుకోలేదని తోట విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే తోట త్రిమూర్తులు పార్టీ వీడ‌టానికి ముందు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆయనతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. రామచంద్రపురం నియోజకవర్గంలో దశాబ్దాల కాలంగా తోట‌కు మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కు మధ్య వైరం ఉంది. ఇప్పుడు తోట వైసీపీ ఎంట్రీకి పిల్లి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తోట వైసీపీ ఎంట్రీకి పిల్లి సుముఖ‌త వ్య‌క్తం చేశాకే... జగన్ ఓకే చెప్పారని సమాచారం. ఇక వైసీపీలో చేరిన తోట త్రిమూర్తులకు జగన్ తూర్పు గోదావరి జిల్లా వైసీపీ పగ్గాలు అప్పగించ బోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: