మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయ‌న తండ్రి, మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి యుగంధర్ కన్నుమూశారు. యుగంధర్ కుమారుడు సత్యనాదేళ్ల. ప్రస్తుతం మైక్రోపాఫ్ట్ సీఈఓగా పనిచేస్తున్నారు. గతంలో ప్రధాని కార్యాలయం కార్యదర్శిగా బీఎన్ యుగంధర్ పనిచేశారు. పీవీ నర్సింహరావు ప్రధానిగా ఉన్న సమయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. దేశంలో గ్రామీణాభివృద్ధిశాఖలో అనేక కీలక సంస్కరణలు తీసుకువచ్చారు. నిజాయితీపరుడిగా, సమర్థ ఐఏఎస్ అధికారిగా యుగంధర్ గుర్తింపు పొందారు. ప్రణాళిక సంఘం సభ్యుడిగా తనదైన ముద్ర వేశారు. లాల్‌బహదూర్‌శాస్త్రి ఐఏఎస్ అకాడమీ డైరక్టర్‌గా పనిచేశారు. పేదల పక్షపాతి ఐఏఎస్‌గా యుగంధర్‌పై ముద్రపడింది.


తండ్రి వ‌లే స‌త్య సైతం బ‌డుగు బ‌ల‌హీన‌వ‌ర్గాల ప‌క్షాన గ‌లం వినిపించాడు.  అమెరికా సరిహద్దులో అక్రమ వలసదారుల కుటుంబాల నుంచి పిల్లల్ని వేరు చేస్తున్న విధానంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న త‌రుణంలో సత్య నాదెళ్ల కూడా స్పందించారు. తన బ్లాగ్‌పోస్ట్‌లో దీనిని నిరసిస్తూ రాసిన విషయాలను లింక్డిన్‌లో నాదెళ్ల షేర్ చేశారు. ప్రధానంగా ఐదు అంశాలను ఆయన లేవనెత్తారు. అక్రమ వలసలను అడ్డుకోవడానికి ట్రంప్ తీసుకొచ్చిన కొత్త విధానం చాలా క్రూరమైనది అని సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు.


ఈ అంశంపై మైక్రోసాఫ్ట్ విధానాన్ని సంస్థ ఎండీ బ్రాడ్ వివరించారని, ఆ వివరాలే ఇవి అని సత్య నాదెళ్ల ఆ బ్లాగ్‌లో రాశారు. అసలు అమెరికా వలసదారుల దేశం. మన ఆర్థిక వ్యవస్థ, సంస్థల అభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్లను మనం ఆకర్షిస్తున్నాం. ప్రపంచానికి ఓ వెలుగు రేఖలా మనం నిలుస్తున్నాం. కానీ ఇలా వలసదారుల కుటుంబాల నుంచి పిల్లల్ని వేరు చేయడం మాత్రం దారుణం. ఓ వలసదారుడిగా, ఓ తండ్రిగా ఇది నన్ను తీవ్రంగా కలచివేస్తున్నది అని సత్య నాదెళ్ల అన్నారు. నిజానికి తన విజయానికి కూడా అమెరికా వలస విధానమే కారణమని నాదెళ్ల చెప్పారు. నేను ఉన్న చోటికి అమెరికా టెక్నాలజీ వచ్చి నన్ను కలలు కనేలా చేసింది. ఆ కలను నెరవేర్చుకోవడానికి అమెరికా వలస విధానం ఉపయోగపడింది అని ఆయన తెలిపారు.


ఇక ఇలా వలసదారుల నుంచి ఇలా పిల్లల్ని వేరు చేసే ఎలాంటి ప్రాజెక్టుల్లోనూ మైక్రోసాఫ్ట్ పాలుపంచుకోవడం లేదని ఈ సందర్భంగా నాదెళ్ల స్పష్టంచేశారు. అసలు వలస విధానమే అమెరికా బలమని ఆయన అన్నారు. వలసదారులే అమెరికాను ఇవాళ ఈ స్థాయిలో నిలబెట్టారు. ప్రతి వ్యక్తి మానవ హక్కులు, పరువును నిలబెట్టే వలస విధానాలకు మైక్రోసాఫ్ట్ మద్దతు తెలుపుతుంద‌న్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: