చూడబోతే పార్టీలో జరుగుతున్న పరిణామాలు అలాగే అనిపిస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో మాజీ మంత్రి, సీనియర్ నేత, కాపు ప్రముఖుల్లో ఒకరైన తోట త్రిమూర్తులు తెలుగుదేశంపార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.  తోట దారిలోనే మరింతమంది నేతలు తొందరలోనే టిడిపికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. నిజానికి తోట రాజీనామా చేయటమన్నది ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు.

 

టిడిపికి తోట రాజీనామా చేయబోతున్నారనే ప్రచారం ఎప్పటి నుండో జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.  చంద్రబాబునాయుడు అమెరికాలో ఉన్నపుడు తోట ఆధ్వర్యంలోనే కాకినాడలో టిడిపిలోని కాపు నేతల్లో ముఖ్యులు సమావేశం అయ్యారు. నిజానికి కాపు నేతలు సమావేశం అయ్యేంత వరకూ తోట ఆధ్వర్యంలో ఓ సమావేశం జరిగిందని కూడా చాలామందికి తెలీదు.

 

ఎప్పుడైతే కాపు నేతల సమావేశం జరిగిందన్న విషయం బయటకు పొక్కిందో వెంటనే చంద్రబాబులో టెన్షన్ మొదలైంది. అందుకనే అమెరికా నుండి కొందరు కాపు నేతలతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. సరే ఆ విషయాలను పక్కనపెడితే తాజాగా తోట రాజీనామా కాస్త సంచలనంగానే మారింది.

 

ఎందుకంటే టిడిపికి రాజీనామ చేసిన తోట మద్దతుదారులతో మాట్లాడుతూ తనతో పాటు టిడిపికి రాజీనామా చేయదలచుకుంటే చేసేయండి అంటూ పిలుపినివ్వటం పార్టీలో చర్చనీయాంశమైంది. ఓ నేత రాజీనామా చేసినపుడు మద్దతుదారల్లో కొందరు ఎలాగూ రాజీనామా చేయటం సహజమే. కానీ  ఆ విషయాన్ని తోట ప్రధానంగా ప్రస్తావించటమే గమనార్హం.

 

ఇక పార్టీలోనే ఉన్నప్పటికీ యాక్టివిటీస్ కు దూరంగా ఉంటున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస్, మాజీ ఎంఎల్ఏ బోండా ఉమా మహేశ్వరరావు లాంటి మరికొందరు కాపు నేతలు కూడా టిడిపికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు ప్రచారం ఊపందుకుంది. డిసెంబర్లో స్ధానిక ఎన్నికలు జరిగే నాటికి చాలామంది కాపు నేతలు రాజీనామా చేసేయటం ఖాయమనే అంటున్నారు. మరి రాజీనామా చేసిన వారంతా బిజెపిలోకే వెళతారో లేకపోతే వైసిపిలో చేరుతారో చూడాల్సిందే.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: