ఒక్క రాజధాని కూడా ఏపీకి లేదని అరవయ్యేళ్ళుగా ఆంధ్రులు కలత చెందుతూ వచ్చారు. మద్రాస్, కర్నూల్, హైదరాబాద్, అమరావతి ఇలా పేర్లు కనిపిస్తున్నాయి కానీ ఆంధ్రులకు రాజధాని అన్నది ఏదీ అంటే చెప్పలేని స్థితి. పదమూడు జిల్లాల  ఏపీలో సరైన నగరం కూడా నిర్మాణం కాలేదు. ఎంతసేపు విశాఖపట్నం, విజయవాడలను చూసి మురిసిపోవడమే మిగిలింది. ఈ నేపధ్యంలో అమరావతి రాజధాని మీద పెద్ద ఎత్తున రచ్చ సాగుతోంది కూడా.


నాలుగు రాజధానులు అంటూ ఈ మధ్య మీడియా ముందు ప్రకటనలు చేసిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఇపుడు రెండు రాజధానులకు దిగిపోయారు. ఏపీకి అమరావతినే రాజధానిగా ఉంచేసుకోండి అంటూ ఓ ఆఫర్ కూడా ఇచ్చారు. అయితే రాయలసీమకు మాత్రం రెండవ రాజధాని కావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని రాయలసీమకే దక్కాలని, కానీ అమరావతిలో పెట్టారని ఆయన అన్నారు. అయితే ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదని, రాయలసీమలో రెండవ రాజధాని పెట్టాలని కోరారు. అందుకు ఆయన పలు ఉదాహరణలు కూడా ఇస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ కి రెండు రాజధానులు ఉన్నాయని, అదే విధంగా ఏపీకి కూడా ఉంటే తప్పేంటని ఆయన ప్రశ్నించారు.


రాయలసీమలో మరో రాజధాని ఏర్పాటు కోసం భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని కూడా ఆయన ప్రకటించడం విశేషం. ఈ విషయంలో వెనకాడే ప్రసక్తే లేదని, ఎందాకైనా వెళ్తామని కూడా ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రాయలసీమకు చంద్రబాబు తీరని అన్యాయం చేశారని వెంకటేష్ విమర్శించడం గమనార్హం. ఉపాధి హామీ నిధులు పెద్ద ఎత్తున రావల్సి ఉందని వాటిని ప్రస్తుత ప్రభుత్వం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.





మరింత సమాచారం తెలుసుకోండి: