ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామచంద్రాపురంకు చెందిన కోడూరి పుష్ప లేఖ రాసింది. గ్రామ పెద్దలకు, పుష్ప తాతకు మధ్య ఏర్పడిన వివాదం పుష్ప మనసును గాయపరచటంతో పుష్ప ఈ లేఖను రాసినట్లు తెలుస్తోంది. వైసీపీ నాయకుడు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు, పుష్ప తాత కోడూరి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని ఒక భూ వివాదం నేపథ్యంలో గ్రామ పెద్దలు దూరం పెట్టినట్లుగా తెలుస్తోంది. 
 
గ్రామ పెద్దలు దూరం పెట్టటంతో రెండు నెలల పాటు వీరి కుటుంబం చీరాలలో నివాసం ఉన్నారు. ఆ తరువాత పోలీసుల సహకారంతో సొంతూరికి వచ్చారు. రెండు నెలల తరువాత వచ్చినా కూడా గ్రామ పెద్దలు ఇంకా ఆ కుటుంబంపై వివక్ష చూపుతున్నారని సమాచారం. కోడూరి వెంకటేశ్వర్లుకు ఒక మనవడు, ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు. వీరు రామచంద్రాపురంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. 
 
ఈ ముగ్గురు పిల్లలు పాఠశాలకు వెళితే తమ పిల్లలను బడికి పంపమని గ్రామస్థులు నిర్ణయం తీసుకున్నారు. బడిలో ఈ ముగ్గురు పిల్లలతో ఎవరి పిల్లలైనా మాట్లాడితే 10,000 రుపాయల జరిమానా ఆ కుటుంబానికి విధిస్తామని గ్రామ పెద్దలు హెచ్చరించారని సమాచారం. ఈ పరిస్థితులతో కలత చెందిన పుష్ప సీఎం జగన్మోహన్ రెడ్డికి తన పరిస్థితులను వివరిస్తూ లేఖ రాసింది. తనకు, తన కుటుంబానికి ఏర్పడిన సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలీక పుష్ప ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. 
 
సీఎం జగన్ కు పుష్ప రాసిన ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాతో మాట్లాడటానికి ఎవరూ లేరు మాతో ఆడుకోవటానికి ఎవరూ లేరు. మా తాతను నాన్నను చంపేస్తారని నా స్నేహితులు చెబుతున్నారు. నాకు చాలా భయంగా ఉంది అని లేఖ రాసింది. మరి సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ లేఖ పట్ల ఎలా స్పందిస్తారో చూడాలి. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: