పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామమే. మిగిలిన హీరోల మాదిరిగా సొంత ప్రయోజనాలు చూసుకోకుండా ప్రజలకు మంచి చేయాలని కోట్ల సంపాదనను వదులుకుని రావడాన్ని ప్రతి ఒక్కరూ హర్షిస్తారు.  ఇక పవన్ భావాలు కూడా చాలా మందికి నచ్చేవే. అయితే పవన్ మాటలకు, చేతలకు మధ్య పొంతన‌ లేకపోవడం వల్లనే ఆయన రాజకీయం రహదారి బాట పట్టడంలేదన్న విశ్లేషణలు ఉన్నాయి. పవన్ మీద గత అయిదేళ్ళుగా ఒక ప్రధాన అభియోగం ఉంది.


దాన్ని ఆయన తన వైఖరితో తిప్పుకొట్టలేకపోతున్నారు, మరింతగా అది నమ్మేలా కూడా పవన్ పోకడలు ఉంటున్నాయని అంటున్నారు. పవన్ చెప్పేది ఏంటి అంటే తనకు మనుషులు ముఖ్యం కాదు, వ్యవస్థలు,  ప్రజలు అని. కానీ పవన్ మనుషులు చుట్టూనే టార్గెట్ చేసుకుని రాజకీయాలు నడుపుతున్నారని వైసెపీ నేతలు అంటున్నారంటే తప్పు ఎక్కడ జరిగిందో పవన్ ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఇక పవన్ మొదటి నుంచి జగన్ని వైఎస్సార్ కుటుంబాన్ని మాత్రమే టార్గెట్ చేసుకుంటున్నారన్నారని కూడా చెబుతున్నారు.


పంచెలూడగొడతాం అంటూ పవన్ యువరాజ్యం అధినేతగా నాటి పంచె కట్టుకున్న ఏకైక  సీఎం వైఎస్సార్ ని మొదట టార్గెట్ చేశారని అంటారు. ఆ తరువాత ఆయన ప్రజారాజ్యం పార్టీ  ఓడిన నేపధ్యంలో కొన్నాళ్ళు మౌనం పాటించి 2014 ఎన్నికల ముంది జనసేన పెట్టడం టీడీపీకి  మద్దతుగా ముందుకు రావడంతో ఆయన మీద ఆ ముద్ర మరింతగా పడిపోయింది. ఇక అయిదేళ్ల చంద్రబాబు పాలనపై పెద్దగా మాట్లాడని పవన్, జగన్ ఇలా అధికారంలోకి వచ్చారో లేదో అలా విమర్శలు చేయడాన్ని మాత్రం వైసీపీ నేతలు  జీర్ణించుకోలేకపోతున్నారు.


జగన్ తప్పులు చేస్తే ఎత్తి చూపాల్సిన బాధ్యత పవన్ కి ఉంది. అదే  సమయంలో ఆయనే చెప్పుకున్నట్లుగా మంచి చేసినా కూడా పట్టించుకోకుండా విమర్శలు చేస్తే అది కొత్త రకం రాజకీయం ఎలా అవుతుందో చెప్పాలని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక పవన్ కంటికి వంద రోజుల్లో అన్నీ తప్పులే కనిపించాయా. ఒప్పులు ఒక్కటీ  లేవా అని కూడా ప్రశ్నిస్తున్నారు. బాబు వంద రోజుల పాలనలో ఒక్క హామీ తీర్చకపోయినా నాడు పవన్ నోరెత్తలేదని కూడా వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.


దీని మీద వైసీపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పవన్ టీడీపీల మధ్య లోపాయికారి బంధం ఉందని, అది ఎన్నికల ముందు కొనసాగిందని, ఇపుడు కూడా టీడీపీ విమర్శలనే పవన్ కూడా చేస్తున్నారని అంటున్నారు. చూడబోతే పవన్ మళ్ళీ టీడీపీ ట్రాప్ లోనే పడ్డారా అన్న అనుమానాలు వైసీపీ నేతలతో పాటు అంతా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ పని ఏపీలో అయిపోయిన వేళ పవన్ తనదైన ఆలోచనలతో రాజకీయం చేస్తే జనసేనకు మంచి భవిష్యత్తు ఉంటుందని అంతా అంటున్నారు. మరి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: