ఏబీఎన్ ఛానల్ పై సీఎం జగన్ కక్ష కట్టారంటూ ఆంధ్రజ్యోతి మీడియా నిన్నటి నుంచి గగ్గోలు పెడుతోంది. సాక్షాత్తూ జగనే ఆదేశాల ద్వారా అనధికారికంగా నిషేధించారని ఆ ఛానల్ కు చెందిన మీడియా చెబుతోంది. ఈ కథనాలపై అధికార పార్టీ వైసీపీ స్పందించింది. ఆ కథనాల్లో వాస్తవం లేదని.. విష ప్రచారమే పచ్చపత్రిక ఉద్దేశ్యమని అంటోంది..


ఆంధ్రజ్యోతి కథనాలపై వైసీపీ స్పందన ఇలా ఉంది..

“ ఏదో కారణంతో వైయస్ జగన్ మీద విషం కక్కడమే ప్రధాన అజెండాగా పని చేస్తున్నారు కనుక ఈ అంశాన్ని కూడా ముఖ్యమంత్రితో ముడిపెట్టి తాటికాయ అక్షరాలతో అచ్చేసి వదిలేస్తున్నారు. నిజంగానే ముఖ్యమంత్రి కక్ష సాధించదలుచుకుంటే ఆ పత్రికాధిపతి ఐదేళ్ల పైరవీల కథలు బయటకు తీస్తే చాలదా?


ఇప్పటిదాకా ఆ పత్రికలో రాసిన విషపు రాతలపై, అబద్ధాలపై, ప్రతిష్టకు భంగం కలిగించేలా అచ్చోసిన అంశాపై ఫిర్యాదు చేసినా, పరువు నష్టం దావా వేసినా సరిపోతుంది. ఇప్పటికే ఆ ప్రతికాధిపతిపై, ప్రతికపై లెక్కలేనన్ని కేసులు, పరువు నష్టం దావాలు ఉండనే ఉన్నాయి.


ఇదీ రాసుకో రాధాకృష్ణా.. వైయస్ జగన్ తన పాలనతో, సంక్షేమ నిర్ణయాలతో ప్రజల మసులు గెలుచుకుంటున్నారు. కనుక ఎప్పటిలా పచ్చ రాతలు, అబద్ధాలు రాసి ప్రజలను నమ్మించేయాలంటే ఇకపై కుదరదు. ప్రజలకు, పాఠకులకు గంతలు కట్టడం వీలు కాదు. పారదర్శక విధానాలతో ప్రజారంజకంగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెంట ఉన్నది అచ్చమైన ప్రజాబలం...


చంద్రబాబుకులా కులబలం, ఎల్లో మీడియా బలగం కాదు. తాము చేసిన తప్పులు కప్పి పుచ్చుకుంటూ, ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై నిందలు మోపుతున్న ఈ పచ్చి అబద్ధాల పత్రికకు ప్రజల తగిన రీతిలో బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయి. రోత రాతలతో ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని, ప్రభుత్వ విధానాలను తప్పుగా ప్రచారం చేస్తున్నందుకు, వాస్తవాలు తెలుసుకున్న పాఠకులే ఛీ కొట్టి మరీ చెల్లు చీటీ కడతారు..” అంటూ అధికార వైసీపీ అంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: