కోల్‌ కతా వీధులు ఎర్రబారాయి. ఉపాధి కోసం రోడ్డెక్కిన వామపక్ష విద్యార్థుల నినాదాలతో మార్మోగాయి. సెక్రటేరియట్ దిశగా దూసుకెళ్లిన విద్యార్ధి సంఘాలను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. హింసాత్మకంగా మారిన ఈ ప్రదర్శనలో పలువురు గాయపడ్డారు. 


కోల్ కతాలో చాలా రోజులకు ఎర్రజెండా రెపరెపలాడింది. ఉపాధి అవకాశాల కోసం వామపక్షాల ఆధ్వర్యంలో యువత రోడ్డెక్కి నినదించింది. మార్చ్ టూ సెక్రటేరియట్ కార్యక్రమాన్ని 12 విద్యార్థి సంఘాలు సంయుక్తంగా నిర్వహించాయి. పశ్చిమబెంగాల్ లో రోజు రోజుకు పెరుగుతున్న నిరుద్యోగ సమస్యకు వ్యతిరేకంగా ఈ రెండు రోజుల కార్యక్రమం చేపట్టారు. పెరిగిపోయిన నిరుద్యోగంపై వెస్ట్ బెంగాల్ యువత నిరసన తెలుపుతోంది. ఉపాధి అవకాశాల్లో సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించి ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతోంది. ఈ క్రమంలో బెంగాల్ లోని హుగ్లీ జిల్లా సింగూర్ నుంచి  విద్యార్థి సంఘాల నేతలు బెంగాల్ సెక్రటేరియట్ ముట్టడించేందుకు యత్నించారు. ఈ క్రమంలో మమతా సర్కార్ కు వ్యతిరేకంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీకి దిగి ఆందోళన చేపట్టారు. హుగ్లీ జిల్లా సింగూర్ లో మూతపడిన నానో ప్లాంట్ దగ్గర మొదలైన ఈ నిరసన బెంగాల్ సెక్రటేరియట్ వైపు సాగింది.


ర్యాలీ బెంగాల్ సెక్రటేరియట్ వైపు వెళ్తుండగా పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లతో వారిని అడ్డుకున్నారు. ముందుకు దూసుకొస్తున్న యువతపై ఖాకీలు లాఠీచార్జి చేస్తూ, టియర్ గ్యాస్ ప్రయోగిస్తూ, వాటర్ కెనన్ లతో  చెదరగొట్టారు. పరిస్థితిని పోలీస్ ఉన్నతాధికారులు సమీక్షించారు. నిరసనకు అనుమతి లేదంటూ పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి ఆందోళనకారులను కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. యువత, పోలీసులకు మధ్య తోపులాట, ఘర్షణ .. రాళ్లదాడి వరకు వెళ్లింది. అయితే, విద్యార్థి సంఘ నేతలమని కూడా చూడకుండా, తమని గొడ్డుల్లా చితకబాదారని నిరసనకారులు ఆరోపించారు. కానీ నిరసనకారులే తమపై రాళ్ల దాడి చేశారని... ఆ తర్వాతే, టియర్ గ్యాస్ ప్రయోగించామని పోలీసులు చెప్తున్నారు. హౌరా జిల్లాలోని బెంగాల్ సచివాలయం వరకూ చేపట్టిన ఈ ప్రదర్శనలో  దాదాపు 12 వామపక్ష విద్యార్థి సంఘాలు సంయుక్తంగా పాల్గొన్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: