ఐదేళ్ళ కాలంలో చంద్రబాబునాయుడు పాల్పడిన అవినీతికి జాతీయ మీడియా కొమ్ము కాస్తోందా ? జాతీయ మీడియా కూడా జాతి మీడియాగా మారిపోయిందా ? జాతీయ స్ధాయిలో ప్రముఖ మీడియా సంస్ధల్లోని కొన్ని రాసిన ఎడిటోరియల్స్ చూస్తే ఎవరికైనా అలాంటి అనుమానాలే వస్తాయి. విచిత్రమేమిటంటే క్షేత్రస్ధాయిలో ఏమి జరుగుతోందో తెలుసుకోకుండా ఎక్కడో ఏసి చాంబర్లలో కూర్చుని సంపాదకీయాలు రాస్తే ఇలాగే ఉంటాయి.

 

హిదుస్ధాన్ టైమ్స్, ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఏషియన్ ఏజ్, ది ఎకనామిక్ టైమ్స్, ది ట్రిబ్యూన్ లాంటి ప్రముఖ మీడియా సంస్ధలు కూడా ఏకపక్షంగా ఎడిటోరియల్స్ రాసేశాయంటే తెర వెనుక ఏదో జరిగిందనే అనుమానం వస్తే అది అనుమానించిన వాళ్ళ తప్పు కాదు.  మీడియా ఏదైనా కానీండి ఎడిటోరియల్స్ లో ఉన్నదేమిటంటే చంద్రబాబు అద్భుతమైన పాలనాదక్షుడు, అమరావతిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన దార్శినికుడు.

 

చంద్రబాబు సంపాదించిన లక్షల కోట్ల సంపదను జగన్మోహన్ రెడ్డి అనే అపరిపక్వ యువ నేత ధ్వసం చేస్తున్నాడట. జనాలు అందించిన అఖండ మెజారిటిని అమరావతి, రాష్ట్రాభివృద్ధికి కాకుండా చంద్రబాబుపై కక్ష తీర్చుకోవటానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నాడట. చలో ఆత్మకూరు అంశంపై ప్రశాంతంగా చేయాలనుకున్న ర్యాలికి అనుమతివ్వకుండా హౌస్ అరెస్టు చేయటంతోనే చంద్రబాబంటే జగన్ ఎంతగా భయపడుతున్నాడో అర్ధమైపోతోందట.

 

అమారవతి నిర్మాణాన్ని ఆపేయటం, పోలవరం ప్రాజెక్టుకు రివర్స్ టెండరింగ్ కు వెళ్ళటం, పిపిఏలను సమీక్ష చేయాలనుకోవటం జగన్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలంటూ ఎండగట్టాయి. పైగా జగన్ నిర్ణయాల వల్ల రాష్ట్రమే కాకుండా మొత్తం భారత ఆర్ధిక వ్యవస్ధకే ప్రమాదం వాటిల్లుతోందట.

 

అమరావతి నిర్మాణాలపై సమీక్ష చేయాలన్న జగన్ నిర్ణయంతో దేశ ఆర్ధిక వ్యవస్ధ ఎలా ప్రమాదంలో పడుతుందో ఎవరకీ అర్ధం కావటం లేదు.  హోలు మొత్తం మీద అర్ధమయ్యేదేమంటే చంద్రబాబు హయాంలో జరిగిన  అవినీతి మీద  జగన్ విచారణలు, సమీక్షలు చేయకూడదని. సంపాదకీయాల్లో రాసిందంతా నిజమే అనుకున్నా మొన్నటి ఎన్నికల్లో జనాలు చంద్రబాబును చావుదెబ్బ కొట్టి జగన్ కు ఎందుకు అఖండ మెజారిటి ఇచ్చారో జాతీయ మీడియా చెప్పగలదా ?

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: