జనసేన అధినేత పవన్ కల్యాణ్ నుండి ఇంతకన్నా భిన్నమైన స్పందనను ఆశించేందుకు లేదు.  జగన్మోహన్ రెడ్డి నూరు రోజుల పరిపాలనపై చంద్రబాబునాయుడు ఏ విధంగా అయితే రచ్చ చేస్తున్నారో అదే విధంగా పవన్ కూడా స్పందించారు. కాకపోతే చంద్రబాబుకు పవన్ కు ఓ తేడా ఉంది. ప్రతి చిన్న విషయానికి చంద్రబాబు రోడ్డెక్కి గగ్గోలు పెడుతున్నారు. పవన్ ఆ పని చేయటం లేదంతే.

 

జగన్ వంద రోజుల పాలనపై పవన్ ఈ రోజు ఓ నివేదికను విడుదల చేశారు. మామూలుగా అయితే ఏడాది వరకూ జగన్ పాలనపై స్పందించకూడదని అనుకున్నారట. కానీ స్పందిచక తప్పలేదట. ఇవే విషయాలను చంద్రబాబు కూడా చెప్పిన విషయాలు గుర్తుకు వస్తున్నాయి.  వైసిపి నవరత్నాలు జనరంజకమైనవి అంటూనే పాలన మాత్రం జన విరుద్ధమైనదట.

 

జగన్ పాలనలో పవన్ కు నచ్చనిది ఏమటయ్యా అంటే 100 రోజుల్లో ఇసుక పాలసీని తీసుకురాలేకపోయారట. పెట్టుబడులన్నీ వెనక్కు వెళ్ళిపోతున్నాయట. వెనక్కు వెళ్ళిపోయిన పెట్టుబడులు ఏవంటే మాత్రం చెప్పలేకపోయారు. ఇండోనేషియా పెడతానన్న 25 వేల కోట్ల పెట్టుబడులు వెనక్కు వెళ్ళిపోయిందనే తప్పుడు ప్రకటన చేశారు.  పవన్ చెప్పినట్లుగా ఇండోనేషియా తన పెట్టుబడిని వెనక్కు తీసుకోలేదు. ఆ విషయాన్ని స్వయంగా ఇండోనేషియా సంస్ధే చెప్పింది.

 

 ఇక ఉథ్ధానం కిడ్నీ బాధిత సమస్యల పరిష్కారానికి జగన్ చొరవ చూపటం జనసేన పోరాట ఫలితమే కానీ బొత్సా పోరాటం వల్ల కాదన్నారు. అంతేకానీ అధికారంలోకి రాగానే సమస్య  పరిష్కారానికి జగన్ చేసిన ప్రయత్నాన్ని అభినందించటానికి మాత్రం పవన్ క నోరు రాలేదు.

 

ఇక మిగిలిన ఆరోపణలన్నీ సేమ్ టు సేమ్. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్లు, పిపిఏల సమీక్ష, రాజధాని నిర్మాణాల్లో జరిగిన అవినీతిపై విచారణ తదితరాలపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలనే పవన్ కూడా చేశారు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఎంత చక్కటి అవగాహన ఉందో అర్ధమైపోతోంది. కాకపోతే ఆ విషయాన్ని పవన్ మాత్రం బహిరంగంగా అంగీకరించటం లేదనుకోండి అది వేరే సంగతి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: