కేంద్ర ప్రభుత్వం ఈ నెల 1 వ తేదీ నుండి అమలులోకి తీసుకొచ్చిన కొత్త మోటారు వాహనాల చట్టం ప్రజలను భయపెడుతోంది. వాహనాలను రోడ్డు మీదకు తీసుకొనిరావాలంటే వేలల్లో, లక్షల్లో పడుతున్న జరిమానాలు సామాన్యులు మోయలేని భారంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ చట్టం ఇంకా అమలులోకి రానప్పటికీ ఈ చట్టం అమలవుతున్న రాష్ట్రాలలో మాత్రం వాహనదారుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 
 
రాష్ట్రాల్లో అధికారాల్లో ఉన్న ప్రభుత్వాలు సైతం ఈ చట్టాన్ని అమలు చేయటం ద్వారా ప్రజల్లో తీవ్ర వ్యతిరేఖత వచ్చే అవకాశం ఉందని వెనక్కు తగ్గుతున్నారు. కేంద్రం ప్రజల ప్రాణాలను కాపాడటానికే ఈ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చామని చెబుతున్నప్పటికీ ప్రజల నుండి ఈ చట్టంపై తీవ్రంగా నిరసన వ్యక్తం అవుతుంది. కొన్ని చోట్ల వాహనం యొక్క విలువ కంటే జరిమానానే ఎక్కువగా ఉంటోంది. 
 
వాహనాలకు విధించిన జరిమానాలను కట్టలేక వాహనాలను కాల్చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు జరిమానాలను అమలు చేయటం ఇష్టం లేక ఈ చట్టం అమలు విషయంలో నిర్ణయాలను మార్చుకుంటున్నాయి. నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వం జరిమానాలను సగానికి సగం తగ్గించింది. ఉత్తరాఖాండ్ రాష్ట్రం కూడా గుజరాత్ రాష్ట్రంలాగా జరిమానాల విషయంలో నిర్ణయాన్ని మార్చుకుంది. 
 
మధ్య ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఇప్పటికే భారీ స్థాయిలో జరిమానాలు విధించలేమని కేంద్రానికి చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఉత్తరాఖాండ్, కేరళ, కర్ణాటక, జార్ఖండ్, పంజాబ్, గోవా రాష్ట్రాలు జరిమానాలను తగ్గించటం కొరకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు ఉండటంతో ఆ రాష్ట్రాలు కొత్త చట్టాన్ని అమలు చేయలేమని చెబుతున్నట్లు తెలుస్తుంది. ఈ కొత్త చట్టం అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలపై వ్యతిరేఖత ప్రజల్లో తీవ్రంగా పెరుగుతోంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: