ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా అమల్లోకి వచ్చిన ఇసుక  విధానం వినియోగదారులకు శాపంగా మారింది. విజయనగరం జిల్లాలో  నూతన ఇసుక పాలసీతో సామాన్య ప్రజానీకాన్ని మైనింగ్ అధికారులు ముప్పతిప్పలు పెడుతున్నారు. చలానాల దగ్గర నుంచి మొదలుకొని...ఇసుక ట్రాన్స్‌పోర్ట్ వరకు జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. పక్క జిల్లాల నుంచి ఇసుకను తీసుకొచ్చామని చెబుతూ టన్ను ఇసుకకు ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. తూకంలోనూ మోసాలు చేస్తూ సామాన్యుల జేబులు గుల్ల చేస్తున్నారు. 


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన  ఇసుక పాలసీ అమలు అస్తవ్యస్తంగా తయారయింది. విజయనగరం జిల్లాలో మైనింగ్ అధికారులు అందరికి అందుబాటులో ఇసుక  ఉంచాలనే ప్రభుత్వ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారు. అప్పులు చేసి మరీ ఇళ్లు కట్టుకుంటున్న సామాన్యులు అధికారులు తీరుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 


రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబరు 5నుంచి కొత్త ఇసుకవిధానం అమల్లోకి వచ్చింది. ఒక్క క్లిక్‌తో  ఇసుక సరఫరా చేస్తామని ప్రభుత్వం చెబుతుంటే... క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. ఆన్‌లైన్ ఇసుక వెబ్ సైట్‌లో విజయనగరం జిల్లా స్టాక్ పాయింట్ల జాడే ఉండటం లేదు. వాస్తవానికి విజయనగరం జిల్లాలో డెంకాడ, సాలూరు, బొబ్బిలిలో స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ సాలూరు, బొబ్బిలిలో అసలు ఇప్పటికీ స్టాక్ పాయింట్ల జాడే లేదు. ఫలితంగా జిల్లాలోని పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు మున్సిపాలీటి ప్రజలు ఇసుక కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.


ఇక విజయనగరం జిల్లాలో ఏర్పాటైన ఏకైక ఇసుక స్టాక్ పాయింట్ డెంకాడలో మాత్రం.. మైనింగ్ అధికారులు జనాలకు పట్టపగలే చుక్కలు  చూపిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఇసుక ధర  టన్ను కు 375 రూపాయిలు ఆన్ లైన్లో చలానా తీసుకువెళ్లిన వినియోగదారులకు  స్టాక్ పాయింట్ వద్ద మాత్రం తిప్పలు తప్పడం లేదు. ఇక్కడ అమ్మే ఇసుక శ్రీకాకుళం నుండి తెచ్చామని టన్నుకు మరో ఐదొందలు డీడీ తీసుకురావాలని చెబుతున్నారు. అధికారుల తీరుతో మళ్లీ బ్యాంకులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.  అన్ని బిల్లులు తెచ్చాక ట్రాన్స్ పోర్టు సైతం వినియోగదారుడే చూసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అన్ని అనుమతులు తెచ్చుకుని యార్డుకొస్తే  మేం ఎంత ఇసుక వేస్తే అంత ఇసుకే పట్టుకెళ్లాలని  అధికారులు  వినియోగదారులను హెచ్చరిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. 


మరోవైపు...సందట్లో సడేమియా అంటూ లారీ, ట్రాక్టర్ యజమానులు  సిండికేట్ అవుతున్నారు. కిలోమీటర్‌కి ఐదు నుంచి పది రూపాయిలు అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా చూసీ చూడనట్టుగానే వ్యవహరిస్తున్నారు. గతంలో బ్లాక్‌లో ఇసుక కొన్నా ట్రాన్స్‌పోర్ట్‌తో సహా పద్దెనిమిది వేల రూపాయలకు విశాఖకి వచ్చేది. ఇప్పుడు  ముప్పై వేల రూపాయలు ఒక లారీకి ఖర్చుపెట్టాల్సి వస్తుంది. జిల్లాలో ఎప్పుడు ఇసుక స్టాక్ వస్తుందో అని కంప్యూటర్ సెంటర్ల ముందు పడిగాపులు కాయాల్సి వస్తోంది. రోజుల తరబడి ఆన్ లైన్‌లో జిల్లా యార్డులలో ఇసుక లభ్యత చూపించడంలేదని  వినియోగదారులు వాపోతున్నారు. జిల్లాలో అనేక నదులు ఉండగా పక్క జిల్లాల నుండి ఇసుక తెచ్చి ఆ భారం వినియోగదారులపై వేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. కొత్త పాలసీతో ఇసుక సులభతరంగా దొరుకుతుందని భావిస్తే...సిమెంట్ కంటే అధిక ధర చెల్లించాల్సి వస్తుందని  వాపోతున్నారు. మొత్తానికి...విజయనగరం జిల్లాలో తాజా ఇసుక విధానంతో సామాన్యులకి మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: