కొడాలి వెంకటేశ్వరరావు(నాని)...రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ గల నేత... టీడీపీ అంటే ఒంటికాలి మీద లేచే నాయకుడు. అయితే 2004, 09లలో గుడివాడ నుంచి టీడీపీలో రెండు సార్లు ఎమ్మెల్యే  గెలిచిన నాని...2014, 2019లో వైసీపీ నుంచి గెలిచారు. అయితే టీడీపీలో గెలిచినప్పుడు రెండు సార్లు ప్రతిపక్షంలోనే ఉన్నారు. 2014లో వైసీపీలో కూడా ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. అయితే 2019లో ఆయన నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలవడం...వైసీపీ అధికారంలోకి రావడంతో ఆయన పంట పండింది.


జగన్ కేబినెట్ లో బెర్త్ దక్కించుకున్నారు. అది కూడా కీలకమైన పౌర సరఫరాల శాఖని సొంతం చేసుకున్నారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతుంది. అయితే వంద రోజుల పాలనలో మంత్రిగా నాని సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. తొలిసారి మంత్రి అయిన తొందరగానే శాఖపై పట్టు సాధించారు. ఈ వంద రోజుల్లోనే పలు కీలక నిర్ణయాలు కూడా అమలు చేశారు. నిరుద్యోగం సమస్యని తగ్గించడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గ్రామ వాలంటీర్ల నియమకాలు జరిగాయి.


అటు వాలంటీర్ల నియమకాలతో తమ ఉద్యోగాలు పోతాయని ఆందోళన చెందిన రేషన్ డీలర్లకు ధైర్యం ఇచ్చి...ఉద్యోగాలు తీసేయడం లేదని కీలక ప్రకటన చేశారు. అలాగే ప్రభుత్వం తరుపున నాణ్యమైన రేషన్ బియ్యాన్ని వాలంటీర్ల ద్వారా ప్రజల ఇంటికి నేరుగా డెలివరీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి విజయం సాధించారు. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్ల‌ అక్కడక్కడ నాణ్యమైన బియ్యం అందని చోట్ల...వెంటనే వాటిని మార్చి మళ్ళీ కొత్త బియ్యం అందించారు.


ఇక పాలన పరమైన విషయాల్లోనే కాకుండా...అధికార పార్టీ నేతగా ప్రతిపక్ష టీడీపీ చేసిన విమర్శలని సమర్ధవంతంగా తిప్పికొట్టారు. టీడీపీ చేసే ప్రతి విమర్శకు కౌంటర్ ఇస్తూ..ప్రభుత్వానికి మద్ధతుగా నిలిచారు.  అలాగే ఇటీవల కృష్ణానదికి వరదలు వచ్చిన సందర్భంలో ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. మొత్తం మీద నాని అటు మంత్రిగా...ఇటు రాజకీయ నాయకుడిగా సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: