ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కొత్త పెట్టుబడులను ఎక్కడినుండి తీసుకొనివస్తుందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వైసీపీ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలైన నవరత్నాలు మరియు ఎన్నికల ప్రణాళిక ఎంతో బాగున్నాయని పాలన మాత్రం అలా లేదని పవన్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రం యొక్క భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేలా ఉన్నాయని పవన్ అన్నారు. 
 
వైసీపీ 100 రోజుల పాలన నివేదికను పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ నివేదికలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం 2.58 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. వైసీపీ పథకాల కొరకు మరో 50 వేల కోట్ల రుపాయలు కావాలి. అప్పులకు వడ్డీలు కడుతూ 50 వేల కోట్ల రుపాయలు ఎక్కడినుండి తెస్తారని పవన్ ప్రశ్నించారు. కేంద్రం విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో సమీక్షలు వద్దని చెప్పినా సమీక్షలు చేసి గందరగోళానికి తెర లేపారని అన్నారు. 
 
వైసీపీ నాయకులు కియా సీఈవోను కియా మొదటి కారు విడుదల సందర్భంలో అవమానించారని అన్నారు. ఏషియా పల్స్ పేపర్ పరిశ్రమ ప్రకాశం జిల్లాలో ఏర్పాటు కావాలని కానీ ఆ కంపెనీ మహారాష్ట్రకు వెళ్లిందని అన్నారు. ప్రజల్లో మచిలీపట్నం పోర్టును తెలంగాణపరం చేస్తున్నారనే వాదన బలంగా ఉందని అన్నారు. రాజధాని విషయంలో అనిశ్చితి సృష్టిస్తే ఎలా అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. 
 
కృష్ణాకు వరద విషయంలో ముందే అప్రమత్తమై ఉంటే రాయలసీమలోని ప్రాజెక్టులకు జలకళ ఉండేదని పవన్ అన్నారు. వైసీపీ కార్యకర్తలను గ్రామ వాలంటీర్లుగా నియమించటం ద్వారా పల్లె వ్యవస్థను నాశనం చేస్తున్నారని అన్నారు. మద్యపాన నిషేధం అని చెబుతూనే మద్యం విక్రయాలను 13 శాతం పెంచారని అన్నారు. పోలవరం రీటెండరింగ్ వలన పోలవరం నిర్మాణం ఆలస్యం కావటంతో పాటు 300 కోట్ల రుపాయలు అదనపు వ్యయం అవుతుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: