ఇటీవ‌లి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో యురేనియం త‌వ్వ‌కాల అంశం ర‌చ్చ‌ర‌చ్చ‌గా మారిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ విష‌యంలో...తెలంగాణ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇంకా స్ప‌ష్టంగా చెప్పాలంటే... తెలంగాణ సీఎం కేసీఆర్ భారం దింపుకొన్నారు. నల్లమల అటవీప్రాంతంలో యురేనియం నిక్షేపాల సర్వేకు తాము ఎలాంటి అనుమతినివ్వలేదని రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ శోభ స్పష్టంచేశారు. ఇంతవరకు అటామిక్ మినరల్ డైరెక్టరేట్ అధికారులెవ్వరూ బోర్‌డ్రిల్లింగ్ పాయింట్లను పరిశీలించడానికి రాలేదని ఆమె చెప్పారు.


యురేనియం తవ్వ‌కాల గురించి పీసీసీఎఫ్ క్లారిటీ ఇచ్చారు. యురేనియం త‌వ్వ‌కాల విష‌యంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని, అపోహలు వద్దన్నారు. అటవీచట్టం ఫారం-సీ రూపంలో ఒక ప్రతిపాదన పంపారు తప్ప.. నిర్దిష్టంగా డ్రిల్లింగ్ పాయింట్ల విషయంపై సమగ్ర ప్లాన్ ఇవ్వలేదని పేర్కొన్నారు. ప్రతిపాదిత నిక్షేపాల సర్వే ప్రాంతాలైన ఉడిమిల్ల, నారాయణ్‌పూర్, అమ్రాబాద్ బ్లాక్‌లు పెద్దపులుల అభయారణ్యం పరిధిలోకి వస్తాయని తెలిపారు. అభయారణ్యంలో వన్యప్రాణుల మనుగడకు ప్రమాదం ఏర్పడకుండా, పర్యావరణం దెబ్బతినకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం అనుమతి పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు.


ఉదయం 6 గంటల నుంచి సూర్యాస్తమయంలోపు డ్రిల్లింగ్ జరుగాలని, వాహనాలు లేకుండా బండి బాటలోనే వెళ్లాలని, పెద్ద వాహనాలను అనుమతించబోమని, చెట్టు కొమ్మకూడా కొట్టరాదన్న పలు షరతులు విధించామని వివరించారు. షరతులన్నీ పాటిస్తే తప్ప అనుమతికి అవకాశం ఉండదని స్పష్టంచేశారు. క్షేత్రస్థాయిలో బోర్ డ్రిల్లింగ్ జరిపే పరిస్థితులున్నాయా అనే విషయంపై క్షుణ్నంగా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. వారి అధ్యయనం పూర్తయ్యాకకానీ, ఏ విషయం చెప్పలేమని పేర్కొన్నారు. అధ్యయనం తర్వాత ప్రతిపాదనను స్టేట్ బోర్డు ఫర్ వైల్డ్‌లైఫ్‌కు సమర్పించాలని, అక్కడ అనుమతి ఇవ్వాలా లేదా అన్నది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందని తెలిపారు. తర్వాత నేషనల్ బోర్డు ఫర్ వైల్డ్‌లైఫ్‌కు నివేదిక ఇవ్వాలని చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: