గ‌తంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన నేతలు ఇప్పుడు ఎక్క‌డ ?  ఉన్నారో ?  కూడా తెలియ‌ని ప‌రిస్థితి. 2014లో గెలిచి అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు త‌మ పార్టీకి సంపూర్ణ మెజార్టీ ఉన్నా వైసీపీకి చెందిన నేత‌ల‌ను, ఎమ్మెల్యేల‌ను భారీగా త‌మ పార్టీలో చేర్చేసుకున్నారు. ఈ లెక్క‌న ఒక‌రు కాదు..ఇద్ద‌రు కాదు ఏకంగా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేశారు. వీరిలో కొంద‌రికి మాత్రం ప‌ద‌వులు ఇచ్చిన చంద్ర‌బాబు మిగిలిన వారిని పూర్తిగా అప్పుడే ప‌క్క‌న పెట్టేశారు.


ఇక ఈ 23  మందిలో కేవ‌లం న‌లుగురికి మాత్ర‌మే మంత్రి ప‌ద‌వులు ఇచ్చిన చంద్ర‌బాబు జ్యోతుల నెహ్రూ లాంటి వాళ్ల‌కు మంత్రి ప‌ద‌వులు ఇస్తాన‌ని మ‌రీ హామీ ఇచ్చి మోసం చేశారు. ఇక తాజా ఎన్నిక‌ల్లో పార్టీ మారిన వారిలో కొంద‌రికి ఎమ్మెల్యే సీట్లే ఇవ్వ‌లేదు. ఎన్నిక‌ల టిక్కెట్ల ప్ర‌క్రియ‌లోనే క‌దిరి మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా లాంటి వాళ్ల‌కు దెబ్బేసిన బాబు ఇప్పుడు ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత వీరెవ్వ‌రిని ప‌ట్టించుకోవ‌డం లేద‌ట‌.


పార్టీ మారిన ఈ 23 మందిలో గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన వారిలో ఒక్క అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తప్ప మరెవరూ గత ఎన్నికల్లో గెలవలేదు. ఆయా నియోజకవర్గాల్లో తిరిగి పాత టీడీపీ నాయకులే ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. ఇక చంద్ర‌బాబే కాకుండా స్థానికంగా నియోజ‌క‌వ‌ర్గాల్లో వారిని టీడీపీ నేత‌లు కూడా ప‌ట్టించుకోవడం లేదు. అస‌లు ఉప్పులేటి క‌ల్ప‌న‌, జ‌లీల్‌ఖాన్, గిడ్డి ఈశ్వ‌రి, వంత‌ల రాజేశ్వ‌రి లాంటి వాళ్లు ఎక్క‌డ ఉన్నారో కూడా తెలియ‌ని ప‌రిస్థితి.


ఇక మిగిలిన నేత‌ల విష‌యానికి వ‌స్తే కలమట‌ వెంకటరమణ, పోతుల రామారావు, అశోక్ రెడ్డి, సునీల్ కుమార్, జయ రాములు, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, మణిగాంధీ, చాంద్ భాషా వంటి నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీని టీడీపీలో చేరిన‌ప్ప‌టికీ ఎన్నిక‌ల్లో పార్టీ నేత‌లు స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం, ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత అధినేత చంద్ర‌బాబు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ప‌రిస్థితి రెంటికీ చెడ్డ రేవ‌డిలా త‌యారైంది. ఇక బాబు అవ‌స‌రం ఉన్న‌ప్పుడు వీరిని చ‌క్క‌గా పార్టీలో చేర్చుకుని ఇప్పుడు ప‌క్క‌న ప‌ట్టేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: