తెలంగాణలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఏ ఇంట్లో చేసినా.. ఒకరికి మించి పెషేంట్స్‌ ఉంటున్నారు. మలేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ వంటి ఇతరత్రా వ్యాధులతో ఆస్పత్రులకు క్యూకడుతున్నారు. చాలా హాస్పిటల్స్ లో మెరుగైన వైద్యం అందక రోగులు నానా కష్టాలు పడుతున్నారు. ఈ పరిస్థితిని ప్రైవేట్ ఆస్పత్రులు క్యాష్ చేసుకుంటున్నాయి. 


కిక్కిరిసిన ఆస్పత్రులు.. పెరుగుతున్న డెంగీ కేసులు.. సరిపోని పడకలు.. ఒక్కో బెడ్‌పై ఇద్దరు, ముగ్గురు పేషెంట్స్‌.. ఇది తెలంగాణ రాష్ర్టంలో రోగుల పరిస్థితి. ఏ ఇంట్లో చూసినా ఒకరిద్దరు జ్వరంతో బాధపడుతున్నారు. మోకాళ్లు, ఒళ్లు నొప్పులు.. జలుబు, దగ్గు, గొంతునొప్పితో బాధపడుతున్నారు. ఎక్కడ డెంగీ సోకిందో ఏమోనన్న భయం రోగులను పీడిస్తోంది. దీనికి తగ్గట్టుగానే డెంగీ కేసులూ పెరుగుతున్నాయి. మలేరియా, టైఫాయిడ్‌, చికెన్ గున్యా వ్యాధులు ప్రబలుతున్నాయి. కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్‌లు సరిపోవడంలేదు. తాత్కాలికంగా మంచాలను తెచ్చినా అవీ చాలడంలేదు. చాలాచోట్ల నేల మీద పడుకోబెడుతున్నారు. అక్కడక్కడా డెంగీ మరణాలు నమోదవుతుండటం కలవరపరుస్తోంది. 


ఇటు హైదరాబాద్‌లో వైరల్ ఫీవర్లు బెంబేలెత్తిస్తున్నాయి. వాతావరణంలో మార్పులు సాధారణ స్థితికి వచ్చినప్పటికీ జ్వరాలు ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. ఏ ఆసుపత్రిలో చూసినా రోగులు క్యూలైన్ లో కనిపిస్తున్నారు. ఫీవర్ హాస్పిటల్ లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఉదయం ఆరు గంటల నుండే వందలాది మంది క్యూ లైన్‌లో వెయిట్ చేస్తున్నారు. ఈ ఒక్క హాస్పటల్‌లోనే ప్రతి రోజు సగటున రెండు వేలకు పైగా జ్వరంతో వస్తున్న బాధితులు ఉంటున్నారంటే సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 


గత ఐదు నెలలుగా తమకు జీతాలు ఇవ్వడం లేదంటూ విధులను బహిష్కరించి ఆందోళన బాట పట్టారు పారా మెడికల్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది. దీంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇదిలా ఉంటే ఆస్పత్రిలోని సిబ్బంది తమను పట్టించుకోవడం లేదంటున్నారు రోగులు. ఎవరి నోట విన్నా జ్వరం, డెంగ్యూ భయమే. ఏ మాత్రం జ్వరం అనిపించినా...డెంగ్యూ వచ్చిందేమో అని ఆందోళన చెందుతున్నారు ప్రజలు. ఆ భయంతో హాస్పటల్స్‌కు పరీక్షల కోసం ల్యాబ్‌లకు క్యూ కడుతున్నారు. లెక్కకు మించి రోగులు వస్తుండటంతో బెడ్స్‌ దొరకడం లేదు. సిబ్బంది సరిగా స్పందించటం లేదని ఆరోపిస్తున్నారు ఫీవర్‌ హాస్పటల్‌లో రోగులు. 


వైద్యాధికారులు మాత్రం డెంగ్యూ ప్రభావం అంతగా లేదని చెబుతున్నారు. గత ఏడాదితో పోల్చితే డెంగ్యూ బాధితుల సంఖ్య చాలా తక్కువగా ఉందంటున్నారు. ఈ నెలాఖరు వరకు వైరల్, డెంగ్యూ ప్రభావం ఉంటుందని...అక్టోబర్‌ నుంచి స్వైన్ ఫ్లూ దాడి ప్రారంభమయ్యే ప్రమాదం ఉందంటున్నారు. మరోవైపు నీలోఫర్‌ ఆస్పత్రిలో ఎక్కడ చూసినా దుర్గంధమే. పారిశుద్ధ్యలోపం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఆస్పత్రి పరిసరాలు మొత్తం చెత్తాచెదారంతో పేరుకుపోయి ఉంది. దీంతో దోమల బెడద ఎక్కువగానే ఉంది. రోగుల తరఫు బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 


విషజ్వరాల సీజన్‌ను ప్రైవేటు ఆస్పత్రులు భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. డెంగీ బాగా ప్రబలుతుండటంతో చిన్నపాటి జ్వరం వచ్చినా ఆ వ్యాధేనేమో అనుకొని జనం ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారు. అక్కడేమో ఆ టెస్ట్‌లు.. ఈ టెస్ట్‌లు చేయాలంటూ ఓ ఆరేడు రకాల పరీక్షలు చేయిస్తున్నారు. చికిత్స పేరుతో ఓ నాలుగైదు రోజులు ఆస్పత్రిలోనే ఉంచేసి వేలకు వేలు బిల్లులు వేసి  డబ్బులు వసూలు చేసి పంపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఏ మాత్రం జ్వరం అనిపించినా.. దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లి.. చికిత్స తీసుకోవాలంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: