అస్మదీయులకు పోలవరం టెండర్లు కట్టబెట్టడానికిఏ రివర్స్ టెండరింగ్ అంటున్నారని పలుమార్లు వైసీపీ సర్కార్ మీద  మాజీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు చేస్తూ వచ్చారు. ఇపుడు అదే టీడీపీ అనుకూల పత్రిక హెడ్డింగ్ అయింది. దాంతో రామోజీరావు అజెండా ఏంటో తెలిసివచ్చిందని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. అస్మదీయులు అంటే ఎవరంటూ మంత్రి అనిల్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. 


రామోజీరావుకు అస్మదీయులు అంటే నవయుగ కాంట్రక్టర్లేమోనని కూడా మంత్రి అన్నారు. ఆయనతో వారికి బంధుత్వం ఉన్న కారణంగా ఈ రకంగా రాస్తున్నారని కూడా అనుమానం వ్యక్తం చేశారు. పోలవరం 31 నెలల పాటు పట్టించుకోని చంద్రబాబుని ఏమీ అనని రామోజీరావు నాడు పోలవరంలో జరిగిన అవినీతి మీద కూడా ఒక్క వార్త రాయలేదని అన్నారు.  తమ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కి వెళ్లడం ద్వారా 20 శాతం తక్కువకు కోట్ చేసినా కూడా వందల కోట్లలో రూపాయల ప్రజాధనం ఆదా అవుతుందని, అందులో మంచి రామోజీరావుకు కనిపించడంలేదా అని మంత్రి అనిల్ ప్రశ్నించారు.


పోలవరం విషయంలో నాడు చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చి కూడా 2016 డిసెంబర్ వరకూ పట్టించుకోలేదని మంత్రి విమర్శించారు. కమిషన్ల కోసం కక్కుర్తి పడి అస్మదీయులకు బాబు పోలవరం కాంట్రాక్టులు కట్టబెట్టారని, ఆ క్రమంలో  ఆయన ప్రత్యేక హోదా కూడా వదిలేసుకుని కేంద్రం  వద్ద నుంచి పోలవరం ప్రాజెక్టుని తీసుకున్నారని అన్నారు. ఇవన్నీ తెలిసినా కూడా అయిదేళ్ళు పోలవరం విషయాలను ప్రస్తావించని రామోజీరావు పత్రిక ఇపుడు రాయడం వెనక ఆంతర్యం ఏంటని మంత్రి నిలదీశారు. ప్రజలు టీడీపీ అవినీతికి, దానికి వంత పాడే ఎల్లో మీడియాకు తాజా ఎన్నికల్లో వాతలు పెట్టినా కూడా రాతలు మారలేదని మంత్రి ఎద్దేవా చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: