ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి నదిలో లాంచీ మునిగిపోయిన ఘటన ఎంతో బాధాకరమైనది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు, కచ్చులూరు మధ్య రాయల వశిష్ఠ అనే ప్రైవేటు బోటు ప్రమాదానికి గురై ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఇప్పటికి ఈ ప్రమాదంలో 11 మంది మరణించారని సమాచారం. గోదావరిలో ఇటువంటి ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఇది ఎంతో విచారించదగ్గ విషయం.

 

 

 

గోదావరిలో పాపికొండలు ప్రయాణం ఎంతో ఆహ్లాదకరం. కొండల మధ్య వంపులు తిరిగే గోదావరిలో ప్రయాణం ఓ మధురానుభూతిని కలిగించాల్సింది పోయి చేదు జ్ఞాపకాలను మిగులుస్తోంది. గతంలో కూడా ఇలానే ఓ బోటు మునిగిపోయి ఎంతోమంది మృతిచెందారు. మరోసారి పాపికొండలు తిరుగు ప్రయాణంలో సాయంత్రం చీకటి సమయంలో నది మధ్యలో లాంచీ ఆగిపోయింది. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులతో కిక్కిరిసిపోయి లాంచీలు వెళ్తున్నాయి. ఎన్ని ప్రమాదాలు జరిగినా లాంచీ నిర్వాహకులు తీరు మారటం లేదు. ప్రమాదం జరిగినప్పుడు కొన్నాళ్ళు నిబంధనలు పాటించడం మళ్లీ నిబంధనలు అతిక్రమించడం షరా మామూలైపోయింది. ఫలితంగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. బోట్లు, నాటు పడవల ప్రమాదాలు కూడా ఎక్కువే. నిర్దిష్ట ప్రమాణాలు కూడా పాటించకుండా, తగినన్ని లైఫ్ జాకెట్లు లేకుండా, లైసెన్సులు లేకుండా ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. 

 

 

 

ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నా నిబంధనలను కఠినతరం చేయలేకపోతున్నాయి. కొన్నిరోజులుగా గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద ఇంకా పూర్తిగా తగ్గుముఖం పట్టకుండానే ఈ ప్రయాణానికి లాంచీ సుముఖం కావడం తప్పు. దూరప్రాంతాల నుంచి వచ్చేవారికి గోదావరి వరద గురించి అవగాహన ఉండదు. ఫలితంగా నిండు ప్రాణాలు బలయ్యాయి. ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోతే పర్యాటకంలో రాష్ట్రానికి చెడ్డ పేరు తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: