ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న పాపికొండలు బోట్ షికారులో మరణమృదంగం మారుమోగుతోంది. పాపికొండల అందాలను ఆస్వాదించేందుకు చేపట్టిన బోట్ షికారు దాదాపుగా 50 కుటుంబాల్లో విషాదాన్ని మిగిలిచింది.  రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని గోదావరి నదిలో లాంచీ మునిగిన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడినవారు తమ వారి కోసం గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ సంఘటన సహాయక చర్యలు చేప్పట్టేందుకు వెళ్లినవార్ని కదిల్చివేసింది. కచులూరు వద్ద గోదావరిలో ప్రమాదానికి గురైన బోటులో గల్లంతైన పర్యాటకులను పరిశీలిస్తే...



హైదరాబాద్ కు చెందిన గాంధీ, విశాల్‌, లక్ష్మణ్‌, జానకిరామ్‌, రాజేష్‌, రఘురామ్‌, అబ్దుల్‌ సలీమ్‌, సాయికుమార్‌, రఘురామ్‌, విష్ణుకుమార్‌, మహేశ్వరరెడ్డి కుటుంబంతో పాటు వరంగల్ కు చెందిన ధశరథన్‌ ఉన్నారు. వీరితోపాటుగా విశాఖకు చెందిన రమణ, రాజోలుకు చెందిన జగన్‌ లు కూడా గల్లంతయ్యారు.ఈ ప్రమాదం నుంచి బయటపడిన హైదరాబాద్‌కు చెందిన ఓ పర్యటకుడు మాత్రం ఈ ఘటన మధ్యాహ్నం 1.20 నుంచి 1.30 మధ్య ప్రమాదం జరిగిందని చెపుతున్నారు. తాము అయిదుగురు వచ్చామని, తన భార్య, బావమరిది, ఆయన పిల్లలు గల్లంతయ్యారని ఆయన తెలిపారు.





లాంచీలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో ఉక్కపోతగా ఉందని కొందరు లైఫ్ జాకెట్లు తీసేశారని.. ఈలోగా భోజన ఏర్పాట్లూ జరుగుతుండడంతో చాలామంది లైఫ్ జాకెట్లు వేసుకోలేదని ఆయన చెప్పారు. ''బిడ్డ లేకుండా నేనెలా బతకాలి.. భర్తను, బిడ్డను పోగొట్టుకుని వచ్చాను.. నేనేం పాపం చేశాను, నేను కూడా చనిపోయి ఉంటే బాగుండేది'' అంటూ ఇతర కుటుంబసభ్యులకు ఫోన్ చేసి తిరుపతికి చెందిన మాధవీలత రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఆమె  ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఆమె భర్త, కుమార్తె గల్లంతవడంతో కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: