గోదారి తల్లి అందరికీ కాపాడుతుంది. ప్రాణాధారమైన నీరు ఇస్తుంది. తన ఉరకలతో మెరుపులతో ఉల్లాసం ఇస్తుంది. ఉత్సాహం కలిగిస్తుంది. కానీ ఆ తల్లి మాత్రం ఎపుడూ దోషిగా నిలుస్తోంది. తన బిడ్డలను తానే దిగమింగే పాపాల భైరవిగా మారుతోంది. ఇంతకీ శాంత గోదారి ఎందుకిలా చేస్తోంది. ఆ తల్లికి తన బిడ్డలనే మింగేయాలన్న‌ ఆవేశం ఎందుకు...అసలెందుకిలా జరుగుతోంది....



నిజానికి తప్పు గోదారమ్మది కాదు, వ్యవస్థది అని చెప్పాలి.  ఏపీలో టూరిజం వల్ల ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందో తెలియదు కానీ గోదారి వద్ద టూరిజం వ్యవహారాలు చూసే వారికి  మాత్రం బాగానే కలసివస్తుందని అంటున్నారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా లాంచీలు అక్కడ తిరుగుతాయి. వాటి లోపలా, బయటా అంతా లోపభూయిష్టంగా ఉన్నా కూడా అనుమతులు ఇచ్చేస్తారు. వాటిని తిప్పుకుంటూ లక్షలు కోట్లు ఆర్జిస్తూంటే  నిఘా పెట్టాల్సిన వారు  మామూళ్ల మత్తులో పడి కళ్ళుమూసుకుంటారు.



బతికి బట్టగడితే దేవుడి పుణ్యం. లేకపోతే గోదారమ్మ పాపం. ఈ విధంగా పరిస్థితి తయారైంది. నిజంగా  గోదారిలో లాంచీల మునక విషాద కధ ఈనాటిది కాదు, దానికి ఆరు దశాబ్దాల చరిత్ర ఉంది. ఎపుడో అనుకుంటే పోనీ అని సర్దుకోవచ్చు. ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉండి కూడా గోదారమ్మ పైన ప్రయాణం సాఫీగా చేయించలేకపోతున్ననందుకు  బాధపడాలి. సిగ్గుపడాలి. ఇక పాడైన, వట్టిపోయిన బోట్లు, లాంచీల్లో కూడా విహార యాత్రలకు పర్మిషన్లు ఇస్తున్న వారే అసలైన పాపాల భైరవులు. గత ఏడాది జూలై  14 న కూడా ఇలాగే  ఐ.పోలవరం మండలం పశువుల్లంక రేవులో జరిగిన పడవ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు.



పలువురు ప్రాణాలతో బయటపడ్డారు. ఆ దుర్ఘటన నుంచి ఇంకా తేరుకోక ముందే నిన్న దేవీపట్నం మండలంలో జరిగిన పర్యటక బోటు ప్రమాదం దేశంలోనే పెను సంచలం రేపింది.  గోదావరిలో ప్రమాదానికి గురైన రాయల్‌ వశిష్ట బోటుకు కూడా ఎటువంటి అనుమతులు లేవని చెబుతున్నారు.మొత్తం ఎంతమంది ఎక్కారో తెలియదు, ఎంతమంది బతికారో తెలియదు, అన్నీ దొంగ లెక్కలే,  తప్పుడు సమాచారమే. వ్యవస్థలో  లోపాలు ఈ తీరుగా ఉంటే వాటిని కంట్రోల్  చేయడంలో అంతా  కూడా విఫలం అవుతున్నాయి.  సమిష్టిగా కుమ్మక్కు అయిపోతున్న వేళ మౌనంగా గోదారి చూస్తూ పాపాలను భరిస్తోంది. అందుకే మరో ప్రమాదం ఆమె పేరు మీద ఖాతాలో పడిపోయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: