ఆరుగాలం శ్రమించే రైతన్నకు మేలు జరిగేలా.. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు రైతన్నలో ఆనందం నింపుతున్నాయి. దేశంలోనే ప్రత్యేకంగా వ్యవసాయ మిషన్ అంటూ ఏర్పాటు చేసిన జగన్.. రైతన్నలను ఆదుకునేందుకు అనేక నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. రైతులు పండించిన పంట లు, వాటికి మార్కెట్లో లభిస్తున్న ధరలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ తగిన కార్యాచరణ రూపొందిచుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


పంటల ధరలను స్థిరీకరించడానికి దీర్ఘకాలిక ప్రణాళికతో వెళ్లాలని జగన్ నిర్ణయించారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, మార్కెటింగ్‌పై ఒక సెల్‌ను ఏర్పాటుచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. వ్యవసాయ మిషన్‌ తదుపరి సమావేశంలో రాబోయే పంటల దిగుబడులు, వాటి లభించే మద్దతు ధరల అంచనాలు, మార్కెట్‌లో పరిస్థితులను నివేదించాలని వ్యవసాయ శాఖ కు ఆదేశాలు ఇచ్చారు.


గత ప్రభుత్వం బకాయి పెట్టిన ఇన్ పుట్ సబ్సిడీ రూ. 1830 కోట్ల రూపాయలను ఈ నెలాఖరులో రైతులకు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. వచ్చే నెల రైతు భరోసా, ఈ ఇన్‌పుట్‌సబ్సిడీలు రైతులకు అండగా ఉంటాయని ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయపడ్డారు. అంతే కాదు.. ప్రస్తుతం పంట చేతికి వచ్చే సమయానికే కొనుగోలు కేంద్రాలు సిద్దంకావాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.


అక్టోబరు 15 నాటికే మినుములు, పెసలు, శెనగల వంటి పంటల కొనుగోలు కోసం కేంద్రాలు తెరవాలని సీఎం జగన్ సూచించారు. రైతులకు కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర ఇవ్వడానికి మంచి విధానాలపై ఆలోచనలు చేయాలని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాలవద్ద వారికి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా పలానా పంటలు వేశామంటూ రైతులు సులభంగా రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచించారు.


సరైన మద్దతు లభించేలా ప్రభుత్వ తీసుకునే చర్యలద్వారా లబ్ధి రైతుకు లభిస్తుందని వెల్లడించారు. రబీ పంటనుంచి ఈ విధానం అమలుకు ప్రయత్నాలు చేస్తామని అధికారులు సీఎం కు తెలిపారు. పంట చేతికివచ్చినప్పుడే కొనుగోలు చేస్తే.. రైతులకు లబ్ధి చేకూరుతుందన్న అధికారులు వివరించారు. మొత్తం మీద ఈ నిర్ణయాలన్నీ అన్నదాతకు ఆనందాన్నిచ్చేవే..!


మరింత సమాచారం తెలుసుకోండి: