యురేనియం తవ్వకాలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా అనుమతి ఇచ్చే ఉద్దేశం లేదన్నారు. అటు కేటీఆర్ కూడా అపోహలు ప్రచారం చేయడం ఆపాలని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. తవ్వకాలకు అనుమతి ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు.. అన్వేషణకు మాత్రం ఎందుకు అంగీకరించారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. 


తెలంగాణ వచ్చాక యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదని, 2009లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అనుమతులిచ్చిందని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఉన్న అనుమతులు కూడా అన్వేషణకు మాత్రమేనని, వెలికితీతకు ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు ముఖ్యమంత్రి. యురేనియం వెలికితీస్తే.. కృష్ణా నది కలుషితమౌతుందని, ఇప్పటికే ఆ ప్రభావం ఏపీలో కడప ప్రజలు అనుభవిస్తున్నారని చెప్పారు కేసీఆర్. 


యురేనియాన్ని అణుశక్తి కర్మాగారాలు, అంతరిక్ష పరిశోధనల్లో వాడతారని చెప్పారు మంత్రి కేటీఆర్. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా అవసరమైతే సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. విపక్ష నేతలు బాధ్యతగా మాట్లాడాలని, ప్రజల్లో అపోహలకు తావివ్వొద్దని కోరారు కేటీఆర్. కాంగ్రెస్ హయాంలో యురేనియంకు అనుమతులు కండీషనల్ గా ఇచ్చారనీ ఆ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పారు. అసలు వెలికీతతకు పర్మీషన్ ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు.. అన్వేషణ మాత్రం ఎందుకని ఆయన ప్రశ్నించారు. నల్లమలను ప్రభుత్వం కాపాడాలని కోరారు జీవన్ రెడ్డి. 


యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా నల్లమల అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న తరుణంలో.. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సర్కారు క్లారిటీ ఇచ్చింది. అటు ఏపీ సర్కారు కూడా స్పందించి.. యురేనియం తవ్వకాలు నిలిపేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. మొత్తానికి యురేనియం తవ్వకాలపై వివిధ సంఘాల నుంచి వ్యతిరేఖత రావడంతో అసెంబ్లీలో పెద్ద చర్చే జరిగింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. 




మరింత సమాచారం తెలుసుకోండి: