ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ప్రకృతి అందాలను ఆస్వాదించాలని వెళ్లి గోదావరి ఒడిలో జలసమాధి అయ్యారు. తూర్పుగోదావరిలోని కచ్చులూరు ప్రాంతంలో నిన్న మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 73 మంది ఈ బోటులో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వీరిలో 12 మంది మృత్యువాత పడగా 27 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరినట్లు తెలుస్తోంది. బోటులో ప్రయాణిస్తున్న మిగతా వారు మాత్రం గల్లంతయ్యారు. 
 
గోదావరి నదిలో జరిగిన ప్రమాదాలలో ఈ ప్రమాదాన్ని రెండవ అతి పెద్ద ప్రమాదంగా చెప్పవచ్చు. గోదావరిలో కచ్చులూరు అత్యంత లోతైన ప్రాంతం. బోటులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు పూర్తి స్థాయిలో లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉంచలేదని తెలుస్తోంది. సుడులు అధికంగా ఉండటం వలన బోటు మునిగి మరలా లేచి అంతలోనే మునిగిపోయిందని తెలుస్తుంది. బోటు మునిగిపోవటాన్ని కొంతమంది చేపలు పట్టే యువకులు గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు.రాయల్ వశిష్ఠ అనే ప్రైవేట్ బోటుకు నిన్న ఉదయం అనుమతి లేదని దేవీపట్నం పోలీసులు నిలిపివేయగా పోలవరం పోలీసులు అనుమతి ఇచ్చారని బోటు నిర్వాహకులు చెప్పినట్లు తెలుస్తోంది.

బోటు నిర్వాహకులు గోదావరి నది ఉధృతిని అంచనా వేయకపోవటం వలనే ఈ ఘటన జరిగింది. ఐదు లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్న సమయంలో బోటును తీసుకెళ్లటమే ప్రమాదానికి ముఖ్య కారణమని తెలుస్తోంది. బోటుకు రెండు ఇంజిన్లు ఉన్నప్పటికీ ఒక ఇంజిన్ లో సమస్యలు ఉండటంతో కేవలం ఒక ఇంజిన్ తో మాత్రమే బోటు నడిపారని తెలుస్తోంది. బోటును నడిపినవారు స్థానికులు కాకపోవటం వలన ప్రమాదాన్ని అంచనా వేయలేకపోయారని తెలుస్తుంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మృతుల కుటుంబాలకు 10 లక్షల రుపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. మంత్రులు ఘటనా స్థలానికి వెళ్లి బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ఆదేశాలిచ్చారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: