దేశాన్ని హిందీ భాషే ఐక్యం చేస్తుందన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యలు వివాద రూపం దాల్చుతున్నాయి. విప‌క్షాల ఐక్య‌త‌కు ఊహించ‌ని అస్త్రాన్ని ఇస్తున్నారు. దక్షిణ భారత రాష్ర్టాల రాజకీయ ప్రముఖులు మండిపడుతున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్మారక కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ మాట్లాడుతూ ఒకదేశం, ఒక భాష భావన ఏనాటికీ వాస్తవరూపం ధరించబోదన్నారు. చెన్నైలో ఎండీఎంకే అధినేత వైకో అధ్యక్షతన జరిగిన సీఎన్ అన్నాదురై 111వ జయంతి సభలో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ హిందీని దేశభాషగా దేశ ప్రజలపై రుద్దేందుకు కేంద్రం నియంతృత్వ పోకడలను అనుసరిస్తున్నదని మండిపడ్డారు. ఇటువంటి అంశాలపై ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు విపక్ష పార్టీలన్నీ ఐక్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. గతంలోనూ హిందీకి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర తమిళనాడుదని పేర్కొన్నారు. 


మరోవైపు ఒక భాషను దేశ ప్రజలందరిపై రుద్దేందుకు ఎటువంటి ప్రయత్నం చేసినా అది దేశ ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు దారి తీస్తుందని సీపీఎం హెచ్చరించింది. హిందీని జాతీయ భాషగా పరిగణించాలన్న భావన భారత రాజ్యాంగ స్ఫూర్తికి, దేశ భాషా వైవిధ్యానికి వ్యతిరేకం. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చిన భాషలన్నీ జాతీయ భాషలే. ఏ భాషను దేశ ప్రజలపై రుద్ధాలని ప్రయత్నించినా అది దేశ ఐక్యత, సమగ్రతకు అంతరాయం కలిగిస్తుంది అని పేర్కొంది. ఒకేదేశం, ఒకే సంస్కృతి, ఒకే భాష అనే ఆరెస్సెస్ భావనను సీపీఎం గట్టిగా వ్యతిరేకిస్తుంది అని తెలిపింది.


భాష పేరిట అమిత్ షా రణనినాదాన్ని తలకెత్తుకున్నారని కేరళ సీఎం పినరాయి విజయన్ పేర్కొన్నారు. హిందీయేతర భాషలు మాతృభాషగా కలవారిపై అమిత్‌షా ప్రకటన యుద్ధ ప్రకటనేనని స్పష్టంచేశారు. హిందీ భాషను బలవంతంగా రుద్దాలని ప్రయత్నించడం ప్రజలందరినీ బానిసలను చేయడమేనన్నారు. హిందీ మనదేశాన్ని ఐక్యం చేస్తుందన్న ప్రకటన అర్ధరహితం. ఆ భాష (హిందీ) మెజారిటీ భారతీయుల మాతృభాష కాదు. దక్షిణ, ఈశాన్య భారత ప్రజలు హిందీ మాట్లాడనందున ఆ భాష మాత్రమే దేశాన్ని ఐక్యం చేస్తుందన్న నమ్మకం తప్పు అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తే అవకాశం ఉందని తెలిసినా భాష పేరిట అమిత్‌షా వ్యాఖ్యలు చేయడం నూతన యుద్ధాన్ని ప్రారంభించడమే అని తర్వాత ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: