రాజధాని  అమరావతి నిర్మాణంపై  కెసియార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబునాయుడు ఊహల ప్రకారం నిర్మించాలని అనుకున్న అమారవతి నిర్మాణం ఉత్త వేస్టని కెసియార్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అమరావతి నిర్మాణంపై పెట్ట దలచుకున్న ఖర్చంతా  డెడ్ ఇన్వెస్టిమెంట్ అంటూ తాను అప్పట్లోనే చంద్రబాబుకు చెప్పినట్లు కెసియార్ అసెంబ్లీలో చెప్పటం సంచలనంగా మారింది.

 

అమరావతి నిర్మాణం మీద పెట్టదలచుకున్న పెట్టుబడంతా సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాల మీద పెట్టమని తాను చంద్రబాబుకు సలహా ఇచ్చినట్లు కూడా చెప్పారు. అయితే తన సలహాలను చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. దాని ఫలితంగానే ఏపి ఎటూ కాకుండా పోయిందన్నారు.  చంద్రబాబు ఆలోచనల ప్రకారం అమరావతి నిర్మాణానికి సుమారు రూ. 53 వేల కోట్లవుతుందన్నారు.

 

అన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సాధించేదేమీ ఉండదని తాను అప్పట్లోనే చంద్రబాబుకు చెప్పినట్లు కెసియార్ ఇపుడు చెప్పారు.  తన మాట విని ఆ పెట్టే ఖర్చేదో సాగునీటి ప్రాజెక్టుల మీద పెట్టే ప్రయత్నం చేసుంటే బాగుండేదన్నారు.  తన మాట కాదన్న చంద్రబాబు ఇటు అమరావతీ కట్టలేకపోగా సాగునీటి ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేకపోయినట్లు ఎద్దేవా చేశారు.

 

పనిలో పనిగా లోక్ సత్తా వ్యవస్ధాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ పైన కూడా మండిపడ్డారు. తాను సాగునీటి ప్రాజెక్టులు కడుతుంటే వేస్ట్ అని చెప్పిన జేపి అదే చంద్రబాబు అమరావతిపై వేట కోట్లు పెడతానంటే మాత్రం డప్పు కొట్టినట్లు ఎద్దేవా చేశారు. అంటే చంద్రబాబుకు జేపి పూర్తిగా మద్దతుదారుడే అని తేల్చి చెప్పారు.

 

తన మాట విని అమరావతి మీదకన్నా సాగునీటి ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టుంటే రాయలసీమకు మంచిగా నీళ్ళు అందించి ఉండవచ్చు అంటూ చంద్రబాబుకు చురకలంటించారు. నిజానికి అమరావతిపై గతంలో ఎప్పుడు కూడా కెసియార్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అలాంటిది హఠాత్తుగా తెలంగాణా అసెంబ్లీలో అమరావతి పై ప్రకటన చేయటం ఆశ్చర్యంగా ఉంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: