అమ్మకు  అన్నం పెట్టలేని వాడు పిన్నమ్మ కు బంగారు గొలుసు చేయిస్తాను… అన్నట్లుగా ఉంది తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వ వైఖరి. అమ్మకు అన్నం పెట్టిన తరువాత పిన్నమ్మ కు బంగారు గొలుసు చేయిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదని,  కానీ కేసీఆర్ సర్కార్ వైఖరి ఎందుకో అందుకు భిన్నంగా ఉందని పలువురు మండిపడుతున్నారు  . ఆంధ్రప్రదేశ్ లో   దేవీపట్నం సమీపంలో జరిగిన బోటు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు తెలంగాణ సర్కార్  ఐదు లక్షల నష్ట పరిహారాన్నిప్రకటించిన విషయం తెల్సిందే  . ఇంతవరకూ అంత బాగానే ఉంది . కానీ గతంలో ప్రకటించిన నష్టపరిహారం సంగతేంది అంటూ బాధిత కుటుంబాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ,  మంత్రి కేటీఆర్ లను  ప్రశ్నిస్తున్నాయి .


 ఏడాది క్రితం కొండగట్టు లో జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సు బోల్తా పడి సుమారు   52 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.   ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడం వల్ల,  చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారి  కుటుంబాలకు తీరని  విషాదాన్ని నింపింది. ఈ సంఘటన జరిగిన వెంటనే మృతుల కుటుంబాలను ఆదుకుంటామని,  ఐదు లక్షల నష్ట పరిహారం  అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే  ఇప్పటి వరకూ కూడా కొండగట్టు బాధితుల కుటుంబాలకు నష్టపరిహారం అందకపోవడం తో,   ఇటీవల బాధిత కుటుంబాల సభ్యులు  మంత్రులను అడ్డుకుని నిలదీశారు .


 ఈ నేపథ్యంలో దేవీపట్నం సమీపం లో  జరిగిన బోటు ప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల నష్ట పరిహారం అందజేస్తామని ప్రకటించడంతో , ముందు ప్రకటించిన తమకే ఇంతవరకు అందజేసింది లేదు కానీ ... ఇప్పుడు పొరుగు రాష్ట్రం లో జరిగిన ప్రమాద బాధిత కుటుంబాలకు నష్టపరిహారం  అందజేస్తామని ప్రభుత్వ పెద్దలు బీరాలు పలుకుతున్నారంటూ వారు ఎద్దేవా చేస్తున్నారు .  ఆపద లో ఉన్నవారిని ఆదుకోవడం ప్రభుత్వాల ధర్మమే కానీ ఆశ పెట్టి మోసగించడం అన్యాయమే అవుతుందని బాధిత కుటుంబాల సభ్యులు మండిపడుతున్నారు . .


మరింత సమాచారం తెలుసుకోండి: