తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లో గతంలోని  దూకుడు, ప్రస్తుతం  తగ్గిందా?,  పార్టీలోనూ ప్రభుత్వ పరంగా ఆయన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారా? అంటే అవుననే రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకోవాలన్న  దూకుడుగా వ్యవహరించే వారు ...  కానీ ఇటీవల ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు కన్పిస్తోందని చెబుతున్నారు  .  ముఖ్యంగా యాదాద్రి  లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ ప్రాకారాల పై తన బొమ్మ చెక్కడం,  దానిపై  రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో వెనక్కి తగ్గిన కేసీఆర్,  ఇటీవల పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల పై కూడా అయన గతం లో ప్రదర్శించిన దూకుడు ఇప్పుడు కన్పించకుండా పోయిందని అంటున్నారు .


  గతంలో పార్టీ నాయకత్వానికి ధిక్కార స్వరం వినిపించిన వారిని  ఎటువంటి కారణం చూపకుండానే పార్టీ నుంచి  బయటకు పంపిన  కేసీఆర్,  ఇటీవల మంత్రి వర్గ విస్తరణ అనంతరం  పార్టీ ఎమ్మెల్యేలు ధిక్కార స్వరాన్ని వినిపించిన వారిని  మందలించే సాహసం చేయలేదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు . రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటుండడం వల్లే పార్టీ ఎమ్మెల్యేలను మందలించే సాహసాన్ని కేసీఆర్ చేయలేకపోయారని అంటున్నారు . ఇక పాలనాపరంగా కూడా కేసీఆర్ ను కష్టాలు వెంటాడుతున్నాయని అంటున్నారు .   


ఆర్థికమాంద్యం పేరిట బడ్జెట్ ప్రతిపాదనలు తగ్గించడం పై విమర్శలు వెల్లువెత్తుతోన్న నేపధ్యం లో ,  ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించిన డానికి సిద్ధమవుతుంటే ... ఇక  ఉద్యోగ, ఉపాధ్యాయులు తమకు వెంటనే ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు .   పదవీ విరమణ వయస్సు 61 సంవత్సరాలకు పెంచి ,  పిఆర్సి ని సవరించాలని వారు పట్టుబడుతున్నారని వెల్లడించారు  . లేదంటే  తాము కూడా సమ్మెకు సిద్ధమన్న సంకేతాలను ప్రభుత్వానికి పంపుతున్నారని పేర్కొంటున్నారు   ఈ నేపథ్యంలో కెసిఆర్ దూకుడుగా వ్యవహరించడం  కంటే ఆచితూచి అడుగులు వేయడమే బెటర్ అని భావిస్తున్నారని  రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: