తెలుగుదేశంపార్టీ రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. విషయం ఏదైనా కానీండి తాము టార్గెట్ చేయదలచుకున్న వ్యక్తి చుట్టూనే రాజకీయాలు తిరిగేట్లు చేయగల సామర్ధ్యం టిడిపికుంది. తాజాగా జరిగిన విషయాన్ని గమనిస్తే ఈ విషయం మరోసారి నిరూపితమవుతుంది.

 

ఈరోజు ఉదయం అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారు. సరే కోడెల మరణంపై అనేక అనుమానాలున్నాయి లేండి. ఉరేసుకున్నారని ప్రచారం జరుగుతుండగా ప్రమాదకరమైన ఇంజెక్షన్లు చేసుకున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.

 

సరే కారణం విధానం ఏదైనా కోడెల మరణించింది అయితే వాస్తవం. ఇక్కడే టిడిపి నేతలు శవరాజకీయాలకు తెరలేపారు. అదేమిటంటే కోడెల మృతికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కారణమంటూ మొదలుపెట్టారు. మూడు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభత్వం కోడెలపై వేధింపులు మొదలుపెట్టిందట. ఆ వేధింపులకు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుని ఉండచ్చంటూ సీనియర్ నేతలు ఆరోపణలు మొదలుపెట్టేశారు.


కోడెలతో పాటు కుటుంబ సభ్యులపై వైసిపి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని టిడిపి నేతలు బుచ్చయ్య చౌదరి, పితాని సత్యనారాయణ, నిమ్మకాయల చినరాజప్ప అండ్ కో జగన్ పై మండిపోతున్నారు. నిజానికి కోడెలపైన కానీ కొడుకు, కూతురుపైన ఎవరూ తప్పుడు కేసులు పెట్టలేదు. అధికారంలో ఉన్నపుడు వాళ్ళు చేసిన అరాచకాలకు, దందాలకు, వేధింపులకు గురైన బాధితులే వాళ్ళపై కేసులు పెట్టారు.


టిడిపి హయాంలోనే వాళ్ళపై ఫిర్యాదులొస్తే పోలీసులు కేసులు కట్టలేదు. అధికారం మారగానే ముగ్గురిపై కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో అసెంబ్లీ ఫర్నీచర్ ను దొంగతనం చేసిన కేసులో స్వయంగా కోడెలపైనే కేసు నమోదైంది. ఇందులో ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులేమీ లేవు. కోడెలపై నమోదైన కేసులన్నీ కేవలం వాళ్ళ స్వయంకృతమనే చెప్పాలి.  

 

కోడెల ఆత్మహత్య చేసుకోవటం నిజంగా బాధాకరమే. కానీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆయనతో పాటు సంతానం చేసిన అరాచకాల మాటేమిటి ? వీళ్ళ వల్ల వేధింపులకు గురైన కుటుంబాలకు ఎలా న్యాయం జరుగుతుంది ? ఆ విషయాలను మాత్రం టిడిపి నేతలు ప్రస్తావించకపోవటమే విచిత్రం.

 


మరింత సమాచారం తెలుసుకోండి: