కోడెల శివప్రసాదరావు కొన్నాళ్లుగా తీవ్ర మనస్థాపానికి గురయ్యారనేది సమాచారం. ఆయనకు ఇంటి పోరు ఎక్కువగా ఉందని అంటున్నారు. వారం రోజులుగా ఆయన కుమారుడితో వాదనలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. కుటుంబసభ్యుల మధ్య విపరీత పరిణామాలు జరిగాయా అనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కాబట్టే ఆయన ఆత్మహత్య చేసుకున్నారా అనే దానిపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

ఆయన కుటుంబసభ్యుల మధ్య గొడవలు ఉన్నాయని, ఆయన ఇంట్లో ఉరి వేసుకున్నారని, పాయిజన్ ఇంజక్షన్లు తీసుకున్నారని, గుండెపోటుకు గురయ్యారని పలు వాదనలు వస్తున్నాయి. మరో వాదన ప్రకారం ఆయన ఇంట్లో ఉరి వేసుకోవడాన్ని చూసిన డ్రైవర్ వెంటనే కిందికి దింపగా అప్పటికే ఊపిరి తీసుకోవటానికి ఆయన ఇబ్బందిపడ్డారని అంటున్నారు. ఆయనను హాస్పిటల్ కు తీసుకొచ్చిన సమయంలో ఆయన డ్రైవర్, గన్ మెన్ మాత్రమే ఉన్నారని అంటున్నారు. ఆయన స్పీకర్ గా ఉన్న సమయంలోనే కుటుంబంలో కలహాలు ఉండేవని అంటున్నారు. అసెంబ్లీ ఫర్నీచర్ సొంత వాడకానికి తరలింపు విషయంలో ఆయన కుమారుడి పాత్ర ఉందని పలు వాదనలు ఉన్నాయి. ఈ ఫర్నీచర్ ఆయన కుమారుడుకు చెందిన గుంటూరులోని వాహనాల షోరూంలో లభించడమే ఉదాహరణ. గత మూడు నెలల కాలంలో ఆయన కుమార్తె, కుమారుడిపై నమోదైన కేసులు కూడా ఆయనపై తీవ్ర ప్రభావం చూపాయని అంటున్నారు.

 

 

 

తీవ్రమైన ఒత్తిడి, మానసిక వేదనతో ఆయన మృతి చెందారని అంటున్నారు. కోర్టు నోటీసులు ఇవ్వడం, బెయిల్ తెచ్చుకోవడం, కోడెల తప్పుంటే కేసులు పెట్టుకోండంటూ సొంత పార్టీ నుంచే వ్యాఖ్యలు రావడం వంటి పరిణామాలు ఆయన మృతికి కారణాలుగా చెప్తున్నారు. దీనిపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. టీడీపీ వర్గాలు మాత్రం ఆయన్ను వైసీపీ ప్రభుత్వం మానసికంగా వేధించిందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: