గోదావరి నది లో జరిగిన బోటు ప్రమాదం నుంచి హైదరాబాద్ కు చెందిన సిహెచ్ జానకి రామారావు శవాసనం వేసి ప్రాణాలతో బయటపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రమాదం జరిగిన తీరును వివరించారు. తామందరం అల్పాహారం చేసి బోటు లో కూర్చున్నామని, కాసేపటికి పాపికొండలు వస్తాయని బోటు సిబ్బంది చెప్పారన్నారు. ఇది డేంజర్ జోన్ అని, బోటు అటు ఇటు, కదిలినా భయపడాల్సిన అవసరం లేదని వారు తమతో చెప్పారని ఆయన పేర్కొన్నారు.


ఆ తర్వాత కాసేపటికే బోటు ఒక్కసారిగా పక్కకు ఒరిగిందన్నారు. ప్లాస్టిక్ కుర్చీల్లో కూర్చున్నవారంతా ఒక పక్కకు వచ్చేసారని, బరువంతా ఒక వైపునే ఉండడంతో బోటు మళ్ళీ యథాస్థితికి రాలేకపోయిందని అన్నారు. మరోవైపు, కింది అంతస్తులో ఉన్నవారంతా ఒకేసారి పై అంతస్తులొకి వచ్చేందుకు ప్రయత్నించారన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే తాను శవాసనం వేసి ప్రాణాలతో బయటపడినట్టు జానకి రామారావు వివరించారు.


హైదరాబాద్ శివారులోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస కాలనీ కి చెందిన జానకి రామారావు రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. భార్య జోతిక తో కలిసి ఆయన విహార యాత్రకు వచ్చారు. ప్రమాదం లో భార్య, బావమరిది భార్య, వారి కుమారుడు గల్లంతయ్యారు. ఆయన మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఇలాంటి సంఘటనే.. తూర్పు గోదావరి జిల్లా,దేవిపట్నం మండలం, కచ్చులూరు వద్ద నిన్న జరిగింది. ప్రమాదం లో 8మంది ప్రాణాలు కోల్పోగా, మరో 25మంది గల్లంతయ్యారు.27మంది సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, బోటు ప్రమాదాలన్ని ఆదివారమే జరుగుతుండటం గమనార్హం. 


గోదావరి, కృష్ణా నదులలో జరుగుతున్న ప్రమాదాల్లో ఎక్కువ ఆదివారం నాడే జరిగాయని చెబుతున్నారు. విజయవాడ సమీపంలో పవిత్ర సంగమం  వద్ద 12 నవంబర్ 2017 న కృష్ణానదిలో భక్తులతో ప్రయాణిస్తున్న బోటు బోల్తా పడింది.ఈ ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ దుర్ఘటన జరిగింది కూడా ఆదివారమే.


గతేడాది జులైలో దేవీపట్నం సమీపంలో బోటు తిరగబడి 15 మంది చనిపోయారు. ఇది కూడా ఆదివారమే జరిగింది. తాజా ప్రమాదం కూడా ఆదివారమే జరిగింది. శని ఆది వారాలు వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో ఆనందంగా గడిపేందుకు విహారయాత్రకు వెళ్లిన వారి  జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోయాయి. ఏపీ తెలంగాణలోని పలు కుటుంబాల్లో ఈ ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలంటూ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: