గుంటూరు జిల్లా కండ్లగుంటలో జన్మించిన కోడెల శివ ప్రసాద రావు, చిన్న చిన్నవయసులో ఉన్నపుడు తమ కుటుంబ సభ్యులు కొందరు సరైన వైద్యం అందక చనిపోవడంతో చలించిపోయి, పెద్దయ్యాక ఎలాగయినా మంచి డాక్టరు కావాలనే కృషి పట్టుదలతో శ్రమించి, గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ విద్యను అభ్యసించారు కోడెల. ఆ తరువాత బనారస్ యూనివర్సిటీ నుండి ఆయన ఎమ్ఎస్ పూర్తి చేసారు. అనంతరం నరసరావుపేటలో పేదల కోసం ఆసుపత్రిని కట్టించి వారికి వైద్యసేవలు అందించేవారు. ఇక అప్పట్లో ఆయన పేరు, ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో మారు మ్రోగడంతో, అప్పటి టిడిపి పార్టీ అధినేత ఎన్టీఆర్ గారు, నరసరావుపేట నియోజకవర్గం నుండి కోడెలను పోటీ చేయమని కోరారు. వాస్తవానికి తన డాక్టరు వృత్తిని వదలడం ఇష్టం లేని కోడెల, అన్న గారి మాట కాదనలేక పోటీ చేయడం, వెనువెంటనే అత్యథిక మెజారిటీతో ఎమ్యెల్యే గా గెలవడం జరిగిపోయింది. ఆ తరువాత వరుసగా కొన్ని పర్యాయాలు అదే నియోజకవర్గం నుండి విజయం అందుకున్న కోడెల, అటు అన్న ఎన్టీఆర్ గారు, 

ఆ తరువాత చంద్రబాబు గారి హయాంలలో టిడిపి తరపున క్యాబినెట్ మంత్రిగా పని చేయడం జరిగింది. ఇక 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ కు జరిగిన ఎన్నికల్లో సత్తెనపల్లి నుండి పోటీ చేసిన కోడెల, విజయాన్ని అందుకోవడంతో పాటు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు స్పీకర్ గా కూడా ఎన్నికవడం జరిగింది. అయితే ఇటీవల 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుండి పోటీ చేసి, వైసిపి అభ్యర్థి అంబటి రాంబాబు చేతిలో ఓటమి చవిచూశారు. మొదటి నుండి టీడీపీకి మంచి పట్టున్న నేతగా, అలానే నరసరావుపేట ప్రాంతంలో మంచి పలుకుబడి ఉన్న నాయకుడిగా చలామణి అయ్యారు కోడెల. అయితే ఇటీవల గత ప్రభుత్వ హయాంలో స్పీకర్ గా ఉన్నపుడు, అక్కడి ఫర్నీచర్ ని అక్రమంగా తన సొంతానికి వాడుకున్నారు అనే నిందారోపణలు ఆయనపై వచ్చాయి. నిజానికి అవి మాత్రమే కాక, టిడిపి హయాంలో కోడెల కుమారుడు మరియు కుమార్తెలు నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో కె టాక్స్ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడ్డట్లు ఇటీవల కొందరు ప్రజలు కూడా కేసులు నమోదు చేయడంతో కోడెల కుటుంబం పై పెద్ద మచ్చ పడింది. 

అయితే ఆయన కుమారుడు శివరామ కృష్ణ అక్రమంగా పలు బలవంతపు వసూళ్లు చేస్తూ మమ్మల్ని బెదిరించారని మరిన్ని ఫిర్యాదులు రావడంతో, కోడెల కొంత మానసిక వేదన చెందారు. నిజానికి సచివాలయ ఫర్నిచర్ విషయమై అప్పటి ప్రభుత్వానికి లేఖ రాసి, అనుమతి పొందిన తరువాతనే తీసుకున్నాను అంటూ కోడెల చెప్పినప్పటికీ, దానిపై సరైన రుజువులు లేకపోవడంతో సొంత పార్టీ వారే ఆయనపై నిందారోపణలు చేసారు. మరోవైపు కుమారుడు, కుమార్తెలపై కేసులు మరింత ఎక్కువ కావడంతో ఇటీవల కోడెల నిద్రమాత్రలు మ్రింగినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇక నేడు ఏకంగా హైదరాబాద్ లోని తన స్వగృహంలోనే ఉరి వేసుకుని కోడెల ఆత్మహత్య చేసుకోవడం చూస్తుంటే, ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకి వచ్చిన వ్యక్తి, ఆఖరుకి కుమారుడి ఘనకార్యాలవల్ల బయటకు వస్తున్న కేసుల చిట్టాను చూసి తట్టుకోలేకే ఆత్మ హత్య చేసుకున్నారు అంటూ, కొందరు ఆంధ్ర ప్రజలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎంతో ఘన కీర్తి గడించిన కోడెల జీవితం ఇలా అర్ధాంతరంగా ముగియడం బాధాకరం అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.......!! 


మరింత సమాచారం తెలుసుకోండి: